సమస్యలు పరిష్కరించండి : వీఆర్‌ఏలు
ధర్నాల వైపు అడుగులు
ఉద్యమం దిశగా ప్రభుత్వ ఉద్యోగుల అడుగులు వేస్తున్నారు. రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చి మొరపెట్టుకున్న స్పందన లేకపోవడంతో పోరాటానికి సమాయత్తమవుతున్నారు. అందులో భాగంగా చలో విజయవాడకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై దశల వారీగా పోరాటాలు చేపట్టి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, సమగ్రశిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు తమ సమస్యల కోసం కలెక్టరేట్ వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయినా ఫలితం లేకపోవడంతో రాష్ట్రస్థాయిలో తమ గళం వినిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దసరా అనంతరం ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
నవచేతన యాప్‌ను రద్దు చేయండి
: అంగన్‌వాడీలు
నవచేతన యాప్‌లతో ఉద్యోగులకు పనిభారం పెంచేశారని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగ్‌వాడీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి.. ఇప్పుడు పట్టించుకోకపోవడం న్యాయమా అంటూ మండిపడుతున్నారు. వార్షిక కార్మిక చట్టాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కేయడాన్ని తప్పుపడుతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరకులు ఇష్టారాజ్యంగా పెంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జీతాలు మాత్రం ఒక్క పైసా కూడా పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలకు పరిష్కారం చూపకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా నవచేతన యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.రూ.26వేలు వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.
వెట్టి చాకిరీ చేయిస్తున్నారు:సమగ్రశిక్ష ఉద్యోగులు
సమగ్ర శిక్షలో 14 ఏళ్లుగా సేవలందిస్తున్నాం..అయినా మా సమస్యలకు పరిష్కారం చూపకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ పార్ట్‌టైమ్ ఇన్ స్ట్రక్టర్లు వాపోతున్నారు. పలుసార్లు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమే కాకుండా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రస్థాయిలో తమ సమస్యలపై పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్ట్, క్రాఫ్ట్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే సిబ్బందిని విద్యాశాఖలో విలీనం చేయడంతోపాటు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ఎస్‌జీటీ స్కేల్ ప్రకారం రూ.32,670 వేతనం చెల్లించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, అదనపు పనిభారం మోపుతున్న డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేియాలని, నిర్దేశిత సమయానికే విధులు పరిమితం చేయాలని, పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. సాధారణ మరణానికి పరిహారాన్ని రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, పీటీఐలు పనిచేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీడీఓ అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు (ఫైల్)
పనిభారం తగ్గించండి : సచివాలయ ఉద్యోగులు
పదుల సంఖ్యలో సర్వే బాధ్యతలు అప్పగించడంతో పనిభారం తీవ్రంగా పెరిగిందని...భారాన్ని తగ్గించాలంటూ సచివాలయ ఉద్యోగులు కనిపించిన ప్రతి జిల్లా అధికారికి విన్నవిస్తున్నారు. చలో విజయవాడకు వెళితే అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే మంజూరు చేయాలని, ప్రొబిషన్ ఆలస్యమైన 9నెలల కాలానికి చెందిన బకాయిలు మంజూరు చేయాలని, జీఓ నంబర్ 11ను రద్దు చేయాలని, మృతి చెందిన ఉద్యోగికి రావాల్సిన ప్రయోజనాలను మూడు నెలల్లో అందించడంతోపాటు వారి కుటుంబంలోని ఒకరికి కారుణ్య ద్వారా ఉద్యోగం ఇవ్వాలని, కనీస మూల వేతనం రూ.30వేలు చెల్లించాలని, స్పష్టమైన ప్రమోషన్ చానల్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చలో విజయవాడకు సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడంతోపాటు పలుసార్లు సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఫలితం లేకపోవడతో వీఆర్‌ఏలు ఇక పోరాటాలకు సిద్ధమవుతున్నారు. వేతనాలు పెంచలేదని, తమిళనాడు తరహాలో ఏపీలోనూ పే స్కేల్ అమలు చేయాలని, అర్హత ఆధారంగా పదోన్నతులు కల్పించాలని, రాజకీయ వేధింపులను అరికట్టి ఉద్యోగ గుర్తింపు కల్పించాలని, పనిభారం తగ్గించాలని, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండున్నరేళ్లలో ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదంటూ వాపోతున్నారు. ఆ దిశగా వామపక్షాలతోపాటు అన్ని సంఘాల నేతల మద్దతును కూడగడుతున్నారు.


