ప్రమాదం జరిగిన బాయిలర్ ప్రాంతం
శ్రీసిటీ (వరదయ్యపాళెం): శ్రీసిటీలోని టాబ్లెట్స్ ఇండియా కంపెనీలో శనివారం సంభవించిన బాయిలర్ బ్లాస్టింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, ఓ మహిళ గాయపడింది. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన నాలుగు విభాగాల అధికారులతో కూడిన విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టింది.
మొక్కుబడిగా తనిఖీ..?
ఫార్మా పరిశ్రమలో బాయిలర్ అత్యంత కీలకమైన విభాగం. నీటిని ఆవిరిగా మార్చి అధిక పీడనంతో మందుల తయారీ, స్టెరిలైజేషన్, డ్రైయింగ్ ప్రక్రియకు ఉపయోగిస్తారు. 24 గంటలు అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంతో పనిచేస్తుంది. కాబట్టి చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. భద్రతా ప్రమాణాల విషయంలో అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో తెలియాల్సి ఉంది. ప్రధానంగా శ్రీసిటీలోని టాబ్లెట్ ఇండియా (టిల్) ఫార్మా పరిశ్రమలో ఏర్పాటు చేసిన రెండు టన్నుల సామర్థ్యం కలిగిన బాయిలర్ కాలపరిమితి 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. అయితే 12 ఏళ్లకే బాయిలర్ పేలిపోవడానికి గల కారణాలను కనిపెట్టాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ బాయిలర్‌ను తనిఖీ చేసిన జిల్లా బాయిలర్ ఇన్‌స్పెక్టర్ అన్ని సక్రమంగా ఉన్నట్లు సర్టిఫై చేశారు. ఈ క్రమంలో తనిఖీ మొక్కుబడిగా సాగిందా అన్నది ప్రస్తుత కమిటీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కార్మికుల ప్రాణాల మీదకు తీసుకువచ్చే బాయిలర్ నిర్వహణ వ్యవస్థలో అధికార యంత్రాంగం అలసత్వం వహించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఒక్క వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు కార్మికుల ప్రాణాలు పోవడంతో పరిశ్రమ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. 250కి పైగా పరిశ్రమలు ఉన్న శ్రీసిటీలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం. అయితే ఈ ఒక్క భారీ పేలుడు కారణంగా సమీపంలోని పలు పరిశ్రమల భవంతులు ఇతర వస్తు సామగ్రి పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. టాబ్లెట్ ఇండియా పరిశ్రమకు సమీపంలోని చెరివి గ్రామంలో పలు పక్కా ఇళ్లగోడలకు పగుళ్లివ్వడంతోపాటు కిటికీల అద్దాలు ధ్వంసమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం..
ఉన్నతాధికారుల పరిశీలన
శ్రీసిటీలోని టాబ్లెట్స్ ఇండియా పరిశ్రమలో చోటు చేసుకున్న బాయిలర్ బ్లాస్టింగ్‌కు సంబంధించి ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బాయిలర్ల శాఖ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, చీఫ్ ఇనన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉషశ్రీ ఆదివారం టాబ్లెట్స్ ఇండియా పరిశ్రమకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బాయిలర్ ఆపరేటర్లు, మెయింటెనెన్స్ సిబ్బంది, ఫ్యాక్టరీ అధికారులతో సమావేశమయ్యారు. లాగ్ బుక్‌లు, మెయింటెనెన్స్ రికార్డులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


