● 6 నెలలకు ఒకసారి మారుతున్న అధికారులు ● ముందుకు సాగని గృహ నిర్మాణాలు
నిరుపేదల సొంతింటి కలలను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణంపై శీతకన్ను వేసింది. ఈ క్రమంలోనే హౌసింగ్‌శాఖ జిల్లా హెడ్ పోస్టును సైతం ఇష్టారాజ్యం చేసేస్తోంది. పక్కా గృహాల పురోగతిని పర్యవేక్షించాల్సిన కీలక అధికారిని సక్రమంగా పనిచేయకుండా మోకాలడ్డుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త వారిని నియమిస్తూ ఆటలాడుకుంటోంది. టీడీపీ నేతల సిఫార్సు ఉంటే చాలు ఎవరికై నా సదరు పోస్టును కట్టబెట్టేస్తోంది. సామర్థ్యం.. పనితీరుతో సంబంధం లేకుండా రికమండేషన్లకు ప్రాధాన్యమిస్తోంది. చివరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా సరే పలుకుబడి ఉంటే చాలు వెంటనే జిల్లా అధికారి స్థానంలో కూర్చోబెట్టేస్తోంది.
హౌసింగ్ జిల్లా సమాచారం
గత వైఎస్సార్‌సీపీ హయాంలో
మంజూరు చేసిన ఇళ్లు 69,215
పూర్తి చేసినవి 25,450
ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసినవి 10,132
భూమి పూజ చేసినవి 4,385
పునాదుల్లోనే ఉన్నవి 3,500
బేసిమెంట్ దశలోవి 13,313
గోడల దశలోని ఇళ్లు 7,902
శ్లాబ్ దశలో ఉన్నవి 4,533
తిరుపతి అర్బన్:చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లా స్థాయి అధికారి పోస్టును.. కాస్త సిఫార్సు ఉంటే చాలు సులభంగా తెచ్చుకోవచ్చునంటూ హౌసింగ్ డిపార్ట్ మెంట్‌లో జోరుగా చర్చసాగుతోంది. అందుకు జిల్లా హౌసింగ్ హెడ్ (డీహెచ్‌హెచ్) పోస్టును ఉదాహరణ గా చూపుతున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హౌ సింగ్ కార్యాలయంలోని ఉద్యోగులు పదే పదే డీహెచ్‌హెచ్ పోస్టును మార్పు చేయడంపై మండిపడుతున్నారు. అవినీతి అరోపణలతో సంబంధం లేదు.. ఆప్షన్–3 ఇంటి నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడినా ఏ మా త్రం పట్టించుకోకుండా రికమండేషన్‌తో సులవుగా జిల్లా అధికారి పోస్టును సంపాదించుకుంటున్నారు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
జిల్లా హౌసింగ్ హెడ్‌ను తరచూ మారుస్తుండడంతో పక్కా గృహాల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీహెచ్‌హెచ్‌కు సైతం తమ పోస్టును కాపాడుకునేందుకే సమయం గడచిపోతోందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు ఉద్యోగులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డీహెచ్‌హెచ్ మహా ఉంటే మూడు నెలలు ఉంటారు.. ఆయనను పట్టించుకునేది ఏముంటదిలే అని తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పూర్తి బాధ్యతలతో కీలకమైన హౌసింగ్ జిల్లా అధికారి పోస్టును భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పేదల ఇళ్ల అసంపూర్తిగానే మిగిలిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
బేసిమెంట్ దశలో ఆగిన ఇంటి నిర్మాణాలు
తాజాగా శ్రీనివాసరావు నియామకం
డీహెచ్‌హెచ్‌గా ఏ.శ్రీనివాసరావును బుధవారం నియమించారు. ఆయన ఏడాది క్రితం ఉద్యోగ విమరణ పొందారు. అయితే మూడు నెలల క్రితం హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. దీంతో పదలు సంఖ్యలో ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు సైతం తిరుపతి ఈఈగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తిరుపతి ఈఈతోపాటు జిల్లా హౌసింగ్ హెడ్‌గా ఇన్‌చార్జి బాద్యతలు అప్పగించారు. అయితే మూడు నెలల నుంచి ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీహెచ్‌హెచ్‌గా విధులు నిర్వర్తించిన గోపాల్‌నాయక్‌ను తిరిగి గూడూరు ఈఈగా పంపించారు. గోపాల్‌నాయక్‌కు ముందు రైల్వేకోడూరు హౌసింగ్ ఈఈ శ్రీరాములురెడ్డి డీహెచ్‌హెచ్‌గా పనిచేశారు.


