తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. బుధవారం ఈ మేరకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. బాణసంచా పేలుస్తూ.. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా గణేశుని నిమజ్జనానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే గణేశుని ప్రతిమలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు వినాయకసాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో మంగళం రోడ్డు వద్ద ఓ వేదిక ఏర్పాటు చేసి విశేష విగ్రహాలకు మంగళ హారతి సమర్పించి వీడ్కోలు పలికారు. చవితి వేడుకుల సందర్భంగా తిరుపతిలో సుమారు 2,500 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 80శాతం వరకు ప్రతిమలను నిమజ్జనం చేశారు. భారీ క్రేన్‌ల సాయంతో సురక్షితంగా ప్రక్రియను పూర్తి చేశారు.
– తిరుపతి మంగళం/ తిరుపతి తుడా


