తిరుపతి సిటీ : ఐక్య పోరాటంతోనే కుల వివక్ష అంతమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బొజ్జాతారకం పదో వర్ధతిని పురస్కరించుకుని బుధవారం ఎస్వీయూ సెనెట్ హాల్లో దళిత సాహిత్యం, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముందుగా బొజ్జాతారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాఘవులు మాట్లాడుతూ బొజ్జా తారకంతో కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. దళితుల కోసం ఆయన సృష్టించిన సాహిత్యాన్ని మేళవించి ముందుకెళ్లితేనే దళితుల సమస్యను అరికట్టవచ్చని తెలిపారు. దళిత అభ్యుదయ సాహిత్య రచనలను వినూత్నంగా తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రస్తుతం దళిత సంఘాల్లో విభజన ద్వారా రాజకీయ స్వార్థం పెచ్చు మీరుతోందని, దళితులందరూ ఐకమత్యంగా ప్రజా ఉద్యమాలను సాగించాలని పిలుపునిచ్చారు. సదస్సులో దక్షిణ భారత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ మాజీ సీఈఓ వెంకట నారాయణ, ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్, రచయిత గోవిందయ్య పాల్గొన్నారు.
పింఛన్ల దరఖాస్తుకు గడువు పెంపు
– 18 వరకు అవకాశం
తిరుపతి అర్బన్:కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


