తిరుపతి తుడా: స్విమ్స్ యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సంద ర్భంగా యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో యూరాలజీ విభాగంలో మూడు అరుదైన శస్త్ర చికిత్సలు జరిగాయని తెలిపారు. ఇందులో తిరుపతి జిల్లా ఐతేపల్లికి చెందిన 49 ఏళ్ల రోగికి కిడ్నీ క్యాన్సర్‌తో పాటు రాళ్లు తయారు కావడంతో స్విమ్స్ యురాలజీ విభాగాన్ని సంప్రదించారని, వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని, మల్టిపుల్ మినిమల్లీ ఇన్వేసివ్ అండ్ నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ పద్ధతుల్లో రాయిని, కిడ్నీలో క్యాన్సర్ ఉన్న భాగాన్ని ఒకేసారి ఎండోస్కోపి, లాపరోస్కోపిక్ అనే క్లిష్టమైన సర్జరీల ద్వారా తొలగించి కిడ్నీని కాపాడారన్నారు. అలాగే శ్రీకాళహస్తి కి చెందిన ఏడేళ్ల బాలుడికి వృషణాల క్యాన్సర్‌తో స్విమ్స్ యురాలజీ విభాగానికి వచ్చారని, సంబంధిత నిర్ధారణ పరీక్షలు తర్వాత టెస్టిస్‌లో క్యాన్సర్ ఉన్న భాగాన్ని మాత్రం తొలగించి మిగతా టెస్టిస్‌ను కాపాడామని చెప్పారు. అలాగే మదనపల్లికి చెందిన 19 ఏళ్ల యువకునికి టెస్టిస్‌లో ట్యూబర్ కులోసిస్ గడ్డ వస్తే జబ్బు పడిన భాగాన్ని మాత్రం ఆపరేషన్ ద్వారా తొలగించి మిగిలిన టెస్టిస్‌ని కాపాడామని ఆయన తెలిపారు. అనంతరం డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ అత్యంత అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించిన స్విమ్స్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్, వారి బృందాన్ని ఆయన అభినందించారు.


