ఎన్‌హెచ్‌ 71 ఫ్లైఓవర్‌పై ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ 71 ఫ్లైఓవర్‌పై ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయండి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

● కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ఎంపీ మిథున్‌ రెడ్డి వినతి

తిరుపతి సిటీ: మదనపల్లి–పీలేరు సెక్షన్‌ ఎన్‌హెచ్‌–71పై ఇటీవల 40 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఫ్లైఓవర్‌పై సరైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు లేకపోవడంతో కలికిరి ప్రాంతానికి చెందిన 60 వేల మంది జనాభా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మంత్రితో మాట్లాడుతూ ప్రస్తుతం హైవే కిరువైపులా సర్వీస్‌ రోడ్లు ఉన్నాయని, అయినప్పటికీ కలికిరి పట్టణ సమీపంలో ప్రధాన రహదారిని చేరుకోవడానికి ఎలాంటి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు. సమీప ప్రవేశ మార్గం దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో స్థానికులు, బస్సులకు, ప్రజారవాణా వాహనాలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో కలికిరి పట్టణానికి అనుసంధానం తగ్గిందన్నారు. ఐఆర్‌సీ ఎస్పీ 84:2014 ప్రకారం పట్టణ ప్రాంతాలు, ప్రధాన పట్టణాల్లో సర్వీస్‌ రోడ్లకు ఒకటి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ప్రవేశ మార్గాలు కల్పించాలని సిఫార్సు చేశారని, అయితే ఐఆర్‌సీ ఎస్పీ 99: 2013, ఎమ్‌ఓఆర్‌టీహెచ్‌ సర్కులర్ల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఈ దూరం 2 నుంచి 5 కిలోమీటర్లు ఉండవచ్చన్నారు. అయితే 50 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో స్థానిక అనుసంధానాన్ని నిర్ధారించడానికి సుమారు కిలోమీటరు దగ్గర దూరం అవసరమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద పట్టణానికి 6 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ప్రవేశ లేదా నిష్క్రమణ మార్గం లేకపోవడం ఐఆర్‌సీ నిబంధనలకు విరుద్ధమని, ప్రజల సౌకర్యంపై ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు. ఈ విషయంపై దృష్టి సారించి ఐఆర్‌సీ ప్రమాణాలకు అనుగుణంగా కలికిరి ఫ్లైఓవర్‌ సమీపంలో తక్షణ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను (స్లిప్‌ రోడ్లను) ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. డీపీఆర్‌ను సమీక్షించి కలికిరి ప్రధాన పట్టణంగా ఉన్నా తగినంత ప్రవేశ సౌకర్యం ఎందుకు కల్పించలేదో స్పష్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement