అన్నమో రామచంద్రా.. | - | Sakshi
Sakshi News home page

అన్నమో రామచంద్రా..

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

● మూతపడుతున్న హోటళ్లు ● యాత్రికులు, బ్యాచిలర్లకు తప్పని తిప్పలు ● 100కి పైగా కర్రీపాయింట్లు మూత

● మూతపడుతున్న హోటళ్లు ● యాత్రికులు, బ్యాచిలర్లకు తప్పని తిప్పలు ● 100కి పైగా కర్రీపాయింట్లు మూత

తిరుపతి అర్బన్‌: ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ సిలిండర్ల గుబులు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటుంది. ఓ వైపు వంట గ్యాస్‌ డిమాండ్‌తో అగచాట్లు, మరోవైపు వ్యాపార సిలిండర్లు లభించడం గగనంగా మారడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ అంటేనే దొరుకుతుందా? లేదా అనే భయం అందరిలోనూ చోటుచేసుకుంది. గ్యాస్‌ వాడకాన్ని సైతం తక్కువ మోతాదులో వినియోగించే దిశగా పలువురు అడుగులు వేస్తున్నారు. అయితే తిరుపతిలో సిలిండర్లు అవసరం అయిన మేరకు అందకపోవడంతో రోజు రోజుకు హోటళ్లు మూతపడుతున్నాయి. తిరుపతి నగరానికి దేశవిదేశాల నుంచి విచ్చేస్తున్న పలువురు భక్తులు ఆహారం కోసం నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బ్యాచిలర్లు అన్నం, చపాతీ, పూరీ, పరోటా తదితర ఆహార పదార్థాలను వాళ్లే తయారు చేసుకున్నప్పటికీ అందులోకి కూరల కోసం పూర్తిగా కర్రీ పాయింట్లకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో తిరుపతిలో 180 వరకు కర్రీపాయింట్లు నడుస్తున్నాయి. అయితే గ్యాస్‌ డిమాండ్‌ నేపథ్యంలో 100కు పైగా మూతపడ్డాయి. దీంతో బ్యాచిలర్లు కూరలు తయారు చేసుకోలేక తిప్పలు పడుతున్నారు. అలాగే పలు కుటుంబాలకు చెందిన వారు సైతం కర్రీపాయింట్లపై ఆధారపడుతుంటారు. వాళ్లు సైతం కర్రీస్‌ పాయింట్ల కోసం నగరంలో గాలింపు చర్యలు చేపట్టాల్సిన దుస్థితి చోటుచేసుకుంది. వీధికి ఒక్కటి కనిపించడం కష్టంగా మారింది. మొత్తంగా గ్యాస్‌ డిమాండ్‌తో అన్ని వస్తువులకు గిరాకీ పెరిగిపోతుంది.

కర్రీపాయింట్లు కీలకం

తిరుపతిలో కర్రీపాయింట్లు ఎంతో కీలకం. నగరంలో లక్షకు పైగా కుటుంబాలు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. మరోవైపు ప్రతి రోజు యాత్రికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు లక్ష మందికి పైగా ఉంటున్నారు. మొత్తంగా 6 లక్షల మందికిపైగా జనం తిరుపతిలో ఉంటున్నారు. అయితే వీరిలో 50 శాతం మందికి పైగా కేవలం హోటళ్లు, కర్రీపాయింట్లపై ఆధారపడి ఆహారం తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ తయారు చేసే సమయం లేకపోవడంతో కర్రీపాయింట్లను ఆధారంగా చేసుకుని, సాంబారు, రసం, మజ్జిగతోపాటు పలురకాల తాళింపులు, చికెన్‌, మటన్‌, ఫిష్‌ తదితర కూరలను ప్రతి రోజు కొనుగోలు చేస్తున్నారు. అయితే 50 శాతానికి పైగా హోటళ్లు, 60 శాతానికి పైగా కర్రీపాయింట్లు మూత వేయడంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడానికి కట్టెలపొయ్యిలే కీలకంగా మారాయి.

ఆహార పదార్థాల ధరలు రెట్టింపు

తిరుపతిలోని హోటళ్లలో 60 శాతం వరకు మూతపడినట్లు తెలుస్తోంది. పలువురు రోడ్లపై చిన్న చిన్న హోటళ్లలో టిఫిన్‌తోపాటు పలు ఆహార పదార్థాలు విక్రయిస్తుంటారు. అయితే అవి మూతపడిపోవడంతో భక్తులు, స్థానికంగా ఉండేవారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ నడుస్తున్న హోటళ్ల వారు ఆహార పదార్థాల ధరలు రెట్టింపు చేశారు. అయినా జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఉదాహణరణకు వారం రోజుల కిందట ఓ పెద్ద హోటల్‌లో ప్లేట్‌ పరోట రూ.90 ఉండేది. ప్రస్తుతం రూ.150కి పెంచేశారు. తిరుపతిలో ఒక్కో వీధిలో పదికి పైగా హోటల్స్‌ నడుస్తున్నాయి. అయితే పలు హోటళ్లు మూతపడిన నేపథ్యంలో ఒక్కో వీధిలో ఒకటి లేదా రెండు మాత్రమే నడుస్తున్నాయి. మరి కొన్ని రోజులు ఇలానే కొనసాగితే అన్నమో రామచంద్రా.. అంటూ జనం అల్లాడిపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కట్టెల పొయ్యిలతో హోటళ్లు నడుపుతున్నారు. కట్టెల ధరలు పెరిగినా కొనుగోలు చేయక తప్పడం లేదు.

నిన్నటి వరకు చిన్న హోటళ్లు..నేడు పెద్ద హోటళ్లకు దెబ్బ

గ్యాస్‌ సిలిండర్ల డిమాండ్‌ నేపథ్యంలో నగరంలో గ్యాస్‌తో వాడకంతో సంబంధం ఉన్న పలు వ్యాపారాల దుకాణాలు మూత వేశారు. అంతేకాదు చిన్న చిన్న హోటళ్ల వారికి సిలిండర్ల లభించకపోవడంతో బ్లాక్‌లో కొనుగోలు చేయలేక మూతవేశారు. అయితే పెద్ద పెద్ద హోటళ్ల యజమానులు మాత్రమే బ్లాక్‌లో కొనుగోలు చేస్తూ వ్యాపారాలు సాగిస్తూ వచ్చారు. అయితే తాజాగా డిమాండ్‌ పెరిగిపోవడంతో పెద్ద పెద్ద హోటళ్లకు సైతం వ్యాపార సిలిండర్లు బ్లాక్‌లో సైతం లభించడం లేదు. దీంతో వాళ్లు సైతం తమ హోటళ్లను మూతవేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా లీలామహల్‌ సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కు వచ్చే మార్గం, ప్రకాశం రోడ్డు, అన్నమయ్య సర్కిల్‌, బైరాగిపట్టెడ సర్కిల్‌ సమీప ప్రాంతాల్లోని హోటళ్లు, జీవకోన మార్గం, అన్నారావు సర్కిల్‌, రామాంజుల సర్కిల్‌ తదితర అనేక ప్రాంతాల్లో పెద్ద హోటళ్లు సైతం సిలిండర్ల కొరతతో మూత వేస్తున్నారు. ఆలయాల జిల్లాగా పేరొందిన తిరుపతి జిల్లాకు నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల, శ్రీకాళహస్తి, తిరుచానూరు, సూళ్లూరుపేట చెంగాళ్లమ్మ, శ్రీనివాసమంగాపురం తదితర ప్రాంతాల్లో ఆలయాలకు వచ్చే భక్తులకు ఆహార కష్టాలు తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement