కలెక్టర్‌ చేతుల మీదుగా పింఛన్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ చేతుల మీదుగా పింఛన్‌ పంపిణీ

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

రేణిగుంట:రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి పంచాయతీ అంబేడ్కర్‌ కాలనీలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం ట్రైనీ కలెక్టర్‌ సందీప్‌ రఘువాన్సీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డితో కలసి పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్లను సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు 2,63,368 మంది పింఛన్‌ లబ్ధిదారులకు సుమారు రూ.113.59 కోట్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శోభన్‌ బాబు, ఎంపీడీఓ రవిచంద్ర, పంచాయతీ కార్యదర్శి రేవతి, వీఆర్వో శంకరయ్య పాల్గొన్నారు.

భాకరాపేట ఘాట్‌ రోడ్డులో కారు దగ్ధం

భాకరాపేట: భాకరాపేట ఘాట్‌లో అన్నమయ్య జిల్లా రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెం గ్రామానికి చెందిన ఒక కారు బుధవారం మధ్యాహ్నం కాలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత దాసరిగుడెం గ్రామానికి చెందిన వెంకటేష్‌కు ఏపీ10 ఏవై1978 స్కోడా కారు ఉంది. వెంకటేష్‌ బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లారు. అయితే కారు మరమ్మతులకు గురి కావడంతో మూడు రోజుల కిందట సర్వీసింగ్‌ చేయాలని వెంకటేష్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ (16), కారు డ్రైవర్‌ రామయ్యతో కలసి తిరుపతికి తీసుకెళ్లి బాగు చేయించారు. తిరిగి బుధవారం స్వగ్రామం రొంపిచెర్లకు వెళుతుండగా భాకరా పేట ఘాట్‌ రోడ్డులో కారు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. వెనక వస్తున్న వాహనచోదకులు గమనించి కారు డ్రైవర్‌ రామయ్యకు చెప్పారు. దీంతో ఇద్దరు కారు నుంచి దూకి ప్రాణాలతో బయట పడ్డారు. కారు కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భాకరాపేట ఎస్‌ఐ కృష్ణయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులతో కలెక్టర్‌

సహపంక్తి భోజనం

వెంకటగిరి(సైదాపురం): పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలసి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, పలుశాఖల అధికారులు సహపంక్తి భోజనం చేశారు. ఆ సమయంలో పాఠశాల స్థితి గతులు, భోజన నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలను విద్యార్థులతో ముచ్చటించి, వివరాలు ఆరా తీశారు. విద్యార్థులను కలెక్టర్‌ ఇంగ్లీషులో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇందులో చురుగ్గా సమాధానం చెప్పిన ఆరో తరగతి విద్యార్ధికి కలెక్టర్‌ పెన్ను బహూకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్‌ సందీప్‌, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement