చంద్రగిరి: వారం రోజులుగా ఒంటరి ఏనుగు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చంద్రగిరి మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసి పంటలను ధ్వంసం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు నాగపట్ల బీటు నుంచి భాకారపేట అడవుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో భాకారాపేట కనుమలో అర్ధరాత్రి రోడ్డుపైకి రావడంతో వాహనచోదకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఒంటరి ఏనుగును అడవిలోకి పంపించేందుకు యత్నించారు. అయితే గజరాజు అధికారులపై తిరగబడింది. ఘీంకరిస్తూ వారు ఉన్న వైపునకు దూసుకువచ్చింది. దీంతో ప్రాణభయంతో అధికారులు అక్కడ నుంచి పరుగులు తీసి, ప్రాణాలను కాపాడుకున్నారు. కొద్ది సేపటి తర్వాత ఒంటరి ఏనుగు భాకరాపేట అడవిలోకి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
భాకరాపేట ఘాట్‌లో గజరాజుల తిష్ట
భాకరాపేట: కొన్ని రోజులుగా చంద్రగిరి–చిన్నగొట్టిగల్లు సరిహద్దుల్లో వీర విహారం చేస్తున్న ఏనుగులు మంగళవారం సాయంత్రం నుంచి భాకరాపేట కనుమలో మకాం వేశాయి. రెండు రోజుల కిందట వరకు దిగవూరు పంచాయతీలో పంట పొలాలను నష్టం చేసిన ఏనుగులు జేసీఆర్ ఎడ్ వ్యాలీ స్కూల్ పరిసరాలు మీదుగా భాకరాపేట కనుమల్లోకి ప్రవేశించాయి. మంగళవారం రాత్రి అంతా ఘాట్ రోడ్డులోనే ఉన్నాయి. బుధవారం ఉదయం 36 బీట్‌లో అడవిలోకి ప్రవేశించాయి. జేసీఆర్ ఎడ్ వ్యాలీ ప్రైవేట్ పాఠశాల పరిసరాల మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉండడంతో స్థానికులను విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తోంది. ఏనుగులు అడవిలోకి తరిమి వేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అలాగే చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు మండలాల్లోని అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.


