శ్రీకాళహస్తి: పరాభవ నామ సంవత్సరమంతా శుభాలేనని శ్రీకాళహస్తీశ్వరాలయ ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణశర్మ అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం శ్రీకాళహస్తీశ్వరాలయంలోని స్వామివారి సన్నిధి వద్ద పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పంచాంగ పఠనం చేస్తూ ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రతి రాశివారు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు బాగా కురుస్తాయన్నారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ఊంజల్‌సేవ మండపం వద్ద గురువారం రాత్రి జరిగిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకుని ప్రముఖ అవధాని మేడసాని మోహన్ మాట్లాడుతూ ఈ ఏడాది రాశులపై అంత దుష్ప్రభావం ఏమీ చూపడంలేదన్నారు. శ్రీకాళహస్తిలో పుట్టినవారికి దక్షిణామూర్తి, జ్ఞానాంబ, శివయ్య అనుగ్రహంతో ఎంతటి కష్టానైనా ఎదుర్కోగలుగుతారన్నారు. అనంతరం వారిని ఆలయాఽధికారులు వారిని ఘనంగా సన్మానించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
స్వామి అమ్మవార్ల పురవిహారం
ఉగాది సందర్భంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి పురవిహారం చేశారు. ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లు పురవిహారం చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


