చంద్రగిరి: మండలంలోని అటవీ సమీప గ్రామాల్లో వారం రోజుల నుంచి అటవీ సమీప గ్రామాల్లో తిష్టవేసిన ఏనుగుల రాత్రుల్లో పంట పొలాలపై దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా గురువారం రాత్రి మండలంలోని యల్లంపల్లి సమీపంలో ఏనుగలు వరి, అరటి తదితర పంటలను ధ్వంస చేశాయి. పంటకు నీరు పెట్టేందుకు వెళ్తిన రైతు ముత్తరామయ్య ఏనుగులను చూసి ప్రాణభయంతో పరుగులు తీశాడు. ఈ క్రమంలో రైతు స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల మందను అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.
పండుగ పూటా పస్తులే
– స్విమ్స్ యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం
తిరుపతి తుడా: రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్న వేళ స్విమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న 800 మంది కార్మికులు చేపట్టిన ఆకలి పోరాటం 22వ రోజుకు చేరుకుంది. పండుగ రోజున కూడా తమ దీక్షా శిబిరం వద్దే తమ పూజలు నిర్వహించుకున్నారు. సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే వేణుగో పాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరం రోజున ప్రజలు ఇళ్లలో సంతోషం నిండిపోతుంటే, స్విమ్స్ కార్మికుల ఇళ్లలో మాత్రం ఆకలి, ఆందోళన మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నా, చర్చలకు పిలవకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యూనియన్ నాయకులు రవి, గోపి, సూరి, వెంకటేష్, బాలకృష్ణ, రాజా పాల్గొన్నారు.


