తిరుపతి క్రైం : వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి వైర్లు చోరీ చేస్తున్న దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రాగి కోసం ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా రెండు జిల్లాల్లో విస్తృతంగా నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 55 కేసుల్లో 195 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు ఈ ముఠా బాధ్యులని పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది గూడూరు రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి, మరొకరు మనుబోలు మండలం యాచవరం గ్రామానికి చెందినవారని చెప్పారు.
తిరుపతిలో 45.. నెల్లూరులో 10 కేసులు
పోలీసుల విచారణలో నిందితుల నేరచరిత్ర వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లాలో 45 కేసులు, నెల్లూరు జిల్లాలో 10 కేసులు నమోదు కాగా, మొత్తం రెండు జిల్లాల్లో కలిపి 55 కేసుల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించినట్లు నిర్ధారణ అయిందని ఎస్పీ తెలిపారు. నిందితులు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని రాగి వైర్లను తీయడం, అనంతరం వాటిని కిలో రూ.700 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
రూ.4 లక్షల విలువైన
రాగి సహా వాహనాలు స్వాధీనం
నిందితుల అరెస్టు సమయంలో వారి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షలు విలువ చేసే 400 కిలోల రాగి, రెండు ఆటోలు, రెండు మోటార్‌సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన వెంకటగిరి సీఐ ఏవీ రమణ, బాలాయపల్లి ఎస్‌ఐ కే గోపి, హెడ్ కానిస్టేబుల్ ఎస్. మురళీకృష్ణ, కానిస్టేబుళ్లు ఎస్‌కే ఖాదర్ మస్తాన్, ఎన్. తిరుపాలు, టీ. శ్రీనివాసులు, హోమ్‌గార్డు కె. శ్రీహరిని జిల్లా ఎస్పీ అభినందించారు.


