తడ: జాతీయ రహదారిపై శ్రీసిటీ విజిటర్ సెంటర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తడకండ్రిగకు చెందిన వైఎస్సార్ సీపీ ముస్లిం మైనారిటీ తడ మండల అధ్యక్షుడు సర్దార్(40) మృతి చెందగా అతనితోపాటు ప్రయాణిస్తున్న ప్రదీప్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాళహస్తి రోడ్డులో సర్దార్ కేఫ్ నిర్వహిస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ కొరతతో మూడు రోజులుగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో మరో గ్రామంలో సిలిండర్ ఉందని తెలుసుకుని అక్కడికి బైక్‌పై వెళ్లి సిలిండర్‌తో తిరుగు పయనం అయ్యాడు. శ్రీసిటీ జీరో పాయింట్ దాటి విజిటర్ సెంటర్ వద్దకు వచ్చే సరికి శ్రీసిటీలో కార్మికులను వదిలి సూళ్లూరుపేట వైపు వెళుతున్న ప్రైవేటు బస్సు, సర్వీసు రోడ్డు నుంచి వేగంగా జాతీయ రహదారిపైకి వచ్చి సర్దార్ బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ రోడ్డుపై పడిపోగా సర్దార్ తల డివైడర్‌కి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థాఽనికులు గాయపడిన ఇద్దరినీ సమీపంలోని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే సర్దార్ మృతి చెందగా వరదయ్యపాళెం మండలం, విఠలాయపాళెం గ్రామానికి చెందిన ప్రదీప్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రదీప్‌కి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. సర్దార్ మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొండపనాయుడు తెలిపారు.


