తిరుపతి అర్బన్: టెన్త్ పరీక్షల్లో భాగంగా రెండో రోజు బుధవారం నిర్వహించిన హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖాధికారులు పెద్ద ఎత్తున పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ రాష్ట్రస్థాయి పర్యవేక్షకులు రవీంద్రనాఽథ్‌రెడ్డి ఐదు పరీక్ష కేంద్రాలు, కడప ఆర్జేడీ శామ్యూల్ ఐదు కేంద్రాలు, డీఈఓ కేవీఎన్ కుమార్ ఆరు కేంద్రాలను పరిశీలించారు. ఇన్విజిలేటర్లతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఛీప్ సూపరింటెండెండ్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. మాస్‌కాఫీయింగ్ చోటుచేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెగ్యులర్ విద్యార్థులు 26,683 మందికి 26,470 మంది హాజరయ్యారు. 213 మంది గైర్హాజరు అయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ పరీక్షలకు 892 మందికి 786 మంది హాజరయ్యారు.106 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వెల్లడించారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పాకాల: మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాకాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్షలు సజీవుగా సాగుతున్నట్లు తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇది వరకే వార్షిక పరీక్షలు పూర్తి అయ్యాయని, బ్రిడ్జ్ కోర్స్‌ను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాబ్జి, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.


