రేపు అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు | - | Sakshi
Sakshi News home page

రేపు అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

Mar 18 2026 7:37 AM | Updated on Mar 18 2026 7:37 AM

చంద్రగిరి: సిరులతల్లి తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీకష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పుష్పపల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం, కుంకుమార్చన, ఊంజల్‌ సేవను టీటీడీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి సిటీ: ఎస్వీయూలో వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు అర్హులైన యూజీసీ జేఆర్‌ఎఫ్‌, నెట్‌, సీఎస్‌ఐఆర్‌–జెఆర్‌ఎఫ్‌, సీఎస్‌ఆర్‌ అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో పరిశోధన చేయాలనుకున్న విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు ఎస్వీయూలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషనన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఎస్వీయూ అధికారిక వెబ్‌సైట్‌, లేదా 0877– 2248589 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ముగిసిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు

తిరుపతి సిటీ: జిల్లాలో గత నెల 23వ తేదీ నుంచి నిర్వహించిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. మంగళవారం జిల్లాలోని 84 పరీక్ష కేంద్రాల్లో జరిగిన కెమిస్ట్రీ పేపర్‌–1 పరీక్షకు 24,772 మందికిగాను 24,335మంది హాజరయ్యారని, 437 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐఓ జి రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్ట్‌ ఇయర్‌ ప్రధాన పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయన్నారు. అలాగే బుధవారం ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ కెమెస్ట్రీ పేపర్‌–2 పరీక్ష జరగనుంది.

అక్రమ కేసులో

మరో ఐదుగురికి రిమాండ్‌

పెళ్లకూరు: మండలంలోని కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, రైతులు ఐదుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పెళ్లకూరు మండల పరిషత్‌ అధ్యక్షుడు పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, చింతంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సంగీతం సుభాష్‌, తెల్లగూటి ప్రభాకర్‌, ముచ్చేలి నాధమునిని పోలీసులు అరెస్టు చేసి, నాయుడుపేట సివిల్‌కోర్టులో హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు.

మనేక్‌షా సెంటర్‌ ఆఫ్‌

ఎక్సలెన్స్‌తో ఎంఓయూ

ఏర్పేడు: దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో నూతన ఆవిష్కరణల కోసం తిరుపతి ఐఐటీ, ద మనేక్‌షా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐఐటీలో మంగళవారం ఐఐటీ డైరెక్టర్‌ కేఎన్‌ సత్యనారాయణ, మానేక్‌షా సెంటర్‌ ముఖ్య పోషకుడు, గౌహటి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దేవేంద్ర జలిహాల్‌ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా భద్రతా సంస్థలు, ప్రముఖ భాగస్వాముల సహకారంతో రక్షణ, ఏరోస్పేస్‌, అంతరిక్ష రంగంపై అధునాతన పరిశోధనలు చేయనున్నట్లు తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మనేక్‌షా సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డా. సుబ్రతా సాహా, మానేక్‌షా సెంటర్‌ సీవోవో శంఖ సువ్ర భౌమిక్‌, తిరుపతి ఐఐటీ రీసెర్చ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement