తిరుపతి కల్చరల్: కోదండరామస్వామివారి వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవాల్లో తొలి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషు వాహనంపై ఆలయ మాడ వీ ధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. మంగళవారం ఉదయం కోదండరామస్వామివారి ఆలయంలో కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణభట్టర్ భరత్‌కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘటాన్ని శాస్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ధ్వజపటం, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆస్థానం జరిపారు. ఉదయం 11 నుంచి 12.45 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.


