పెనగలూరు: మద్యం మత్తులో జరిగిన గొడవలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ రఘురాం కథనం మేరకు.. పెనగలూరులోని బ్రాందీషాపు వద్ద ఈ నెల 11వ తేదీన సింగనమల గ్రామానికి చెందిన సామినేని నరసింహులు (36), కుంబాలకుంట గ్రామానికి చెందిన గుండ్లూరు వెంకటేశులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో వెంటనే వెంకటేశు తన కుమారుడైన గణేష్‌కు ఫోన్ చేసి గొడవ పడిన ప్రాంతానికి పిలిపించుకుని మద్యం మత్తుతోపాటు అనారోగ్యంగా ఉన్న నరసింహులను వెంకటేష్, గణేష్ కొట్టి, కిందపడేసి తన్నారు. చుట్టు పక్కల వారు రావడంతో ఇద్దరు పారిపోయారు. దీంతో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసింహులకు రాజంపేటలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ మృతి చెందాడు. ఈ విషయమై 12వ తేదీ మృతుని భార్య సింధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


