గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటళ్లు
హోటళ్ల నిర్వహణ భారం
కట్టెల పొయ్యిలతో పలుచోట్ల వంటకాలు
తిరుపతి అర్బన్: ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం నెలకొంది. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లో చిరు వ్యాపారుల జీవనోపాధికి ఆటంకాలు తప్పడం లేదు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుపతికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివచ్చి, వెళుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని హోటళ్లలో బస చేస్తుంటారు. అయితే గ్యాస్ కొరతతో హోటళ్ల నిర్వహణ భారంగా మారడంతో పలువురు మూత వేస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో వంట గ్యాస్ రూ.900 నుంచి రూ.వెయ్యిలోపు ఉండాల్సిన సిలిండర్‌ను, అక్రమార్కులు రూ.2,500 వరకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ ధర మరింత ప్రియం అయ్యింది. దీంతో తిరుపతిలో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడినట్లు తెలుస్తోంది. కొందరు హోటళ్ల యజమానులు గ్యాస్ సమకూర్చుని, గ్యాస్ ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ధరలు పెంచుతున్నట్లు తమ హోటళ్లలో బోర్డులు పెట్టేశారు. మరోవైపు కాఫీ, టీ ధరలు సైతం పెరుగుతున్న పరిస్థితి నెలకొంది.
కట్టెల పొయ్యిల ఏర్పాటు దిశగా అడుగులు
గ్యాస్ సిలిండర్ల కొరత చోటుచేసుకుంటున్న క్రమంలో పలువురు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కొంత మేరకు కట్టెల పొయ్యిలకు అవకాశాలున్నా..పట్టణ, నగర ప్రాంతాల్లో సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కల్యాణ మండపాల్లోను గ్యాస్ సిలెండర్ల కొరతతో ఆ దిశగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలోని కొర్లగుంటలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద గ్యాస్ కొరత నేపథ్యంలో కట్టెల పొయ్యిలతోనే వంటకాలు పూర్తి చేసుకున్నారు.
గ్యాస్ సంక్షోభం?
గ్యాస్ నిల్వలున్నాయి..ఆందోళన వద్దు
గ్యాస్ నిల్వలు జిల్లాలో అవసరం అయిన మేరకు ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ గోవిందరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో రూరల్ ప్రాంతంలో 45 రోజుల తర్వాత, అలాగే అర్బన్ ప్రాంతాల్లో అయితే సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత, డబులు సిలెండర్ ఉన్నవారు 32 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ సరఫరా సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 0877–2236007కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


