తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ విభాగానికి ఏడు ఉగాది సేవా పతకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు, ఎస్పీ శ్రీనివాస్‌లు అధికారుల, సిబ్బంది పనితీరును గుర్తించి పతకాలను సిఫారసు చేశారు. టాస్క్‌ఫోర్స్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ బి.సత్యసాయి గిరిధర్‌కు సేవా పతకం, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ సి.వినోద్ కుమార్‌కు కఠిన సేవా పతకం, కానిస్టేబుల్ ఎం.మణికంఠ, హెడ్ కానిస్టేబుళ్లు కే రాజేష్ రాజుకు కఠిన సేవా పతకం, ఎం. వెంకటరమణకు సేవా పతకం, కానిస్టేబుళ్లు ఎం.రాజేష్‌కు ఉత్తమ సేవా పతకం, డి.కిరణ్‌కు సేవాపతకం లభించాయి. ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సేవా పతకాలను ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ఇదే తరహాలో కర్తవ్య నిబద్ధతతో పని చేసి, మరెన్నో పతకాలను పొందాలని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ సూచించారు. పతకాలను పొందిన వారికి అభినందనలు తెలిపారు.
మతి స్థిమితం లేని వ్యక్తిని రక్షించిన ఎస్టీఎఫ్
– కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎస్టీఎఫ్ డ్రైవర్ గిరి
చంద్రగిరి: శ్రీవారి దర్శనార్థం వచ్చి మతిస్థిమితం లేని వ్యక్తిని రక్షించి, తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన మంగళవారం తిరుపతి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా దిండిగల్‌కు చెందిన వినోద్ ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చాడు. ఆపై తిరుపతికి వచ్చిన వినోద్ వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నగదు దోచుకెళ్లారు. దీంతో మతిస్థిమితం కోల్పోయిన వినోద్, తిరుపతి బస్టాండ్ వద్ద తిరుగుతుండగా విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ డ్రైవర్ గిరి గుర్తించాడు. ఆపైన వినోద్ కుమార్‌ను చేరదీసి, వివరాలు సేకరించాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం వినోద్ కుమార్‌ను ఎస్టీఎఫ్ సిబ్బందితో కలసి అప్పగించాడు. ఎస్టీఎఫ్ సిబ్బంది, డ్రైవర్ గిరి చేసిన సాయం తమ కుటుంబం విషాదంలోకి వెళ్లకుండా కాపాడారంటూ పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
రేపు మహతిలో ఉగాది సంబరాలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం మహతి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని అనంతరం ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్యయన సంస్థ పండితులు వేదపారాయణం, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం,భగవద్గీత అనుష్టానం, భగవద్గీత అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించనున్నట్టు తెలియజేసింది.
స్విమ్స్ ఓపీ, ఓటీలకు రేపు సెలవు
తిరుపతి తుడా: ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, పేషెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఆస్పత్రిలో అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం
– రూ.3 లక్షల ఆస్తి నష్టం
తిరుపతి క్రైం: ఆటోనగర్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నారాయణ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కుదిరి దుకాణం ముందు నిల్వ ఉంచిన గుదరి (గోజారి) సామాన్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో గుదరి సామన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.


