తిరుపతి క్రైం: నగరంలోని గరుడ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి ఈస్ట్ పోలీసుల కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన ఉమేష్ కుమార్ (35), తరుణ్ కుమార్ (36) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా తిరుపతిలోనే నివాసం ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ రాత్రి ఇద్దరూ తమకు పరిచయమైన వ్యక్తి వద్ద నుంచి తీసుకున్న ఏపీ 39 ఏకే 2909 నంబర్ హోండా యాక్టివా స్కూటీపై వ్యక్తిగత పని నిమిత్తం బయలుదేరారు. అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో తిరుపతిలోని గరుడ వారధిపై బ్లిస్ హోటల్ సమీపంలోని రామానుజ సర్కిల్ వద్దకు చేరుకోగానే స్కూటీ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న తరుణ్ కుమార్, ఉమేష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 అంబులెనన్స్‌లో వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే ఉమేష్ కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ తరుణ్ కుమార్ కూడా సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


