కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు పచ్చమూక దాడులు..దౌర్జన్యాలపై నిరసన బాధితులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మండిపాటు బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చిత్తూరు..తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద ధర్నా
అప్రజాస్వామిక పాలన
●
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తున్న నేతలు
తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు
భయపడం
వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లన్నీ వారితో నింపినా భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలపై అధికార పార్టీకి చెందిన గూండాలు దాడులు చేస్తే వారిని వదిలిపెట్టి, దాడిలో గాయపడిన మా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం దుర్మార్గం. ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై అక్రమ కేసు నమోదు చేయడం, నెల్లూరు డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, మరికొంత మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు, రెడ్‌బుక్ పాలనకు నిదర్శనం.
– డాక్టర్ మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
బాధితులపై కేసులు పెడతారా?
వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి బాధితులపైనే కేసులు పెడతారా..? చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలంటే చులకనగా చూస్తున్నారు. మగువ, మత్తుపదార్థాలతో కూటమి నేతలు జోగుతున్నారు. అధికార అహంకారంతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాసలీలల బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అర్హత లేదు. శ్రీవారి భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు నిజంగా శ్రీవారిపై భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడుని తొలగించాలి.
– నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎం
భ్రష్టు పట్టించారు
టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా టీటీడీ ప్రతిష్టను బీఆర్ నాయుడు భ్రష్టుపట్టించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్నీ అపరాచాలే. ఇలాంటి చైర్మన్ ఎప్పుడూ లేడు. ఇక రారు కూడా. ఆయనను ఇంకా చైర్మన్‌గా కొనసాగిస్తే అంత కంటే మహాపాపం మరొకటి ఉండదు. ఇప్పటికై నా చేసిన తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు తప్పుకోవాలి. – సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్సీ
నిరసన తెలిపే హక్కు లేదా?
ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతోనే కూటమి పాలన సాగిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఎస్సీలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. కామ కలాపాలు సాగించే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా కొనసాగించడం దారుణం. – నూకతోటి రాజేష్,
సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త
సాక్షి ప్రతినిధి, తిరుపతి/మంగళం: రెడ్‌బుక్ రాజ్యాంగంపై వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం ఈ మేరకు తిరుపతి, చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన మెరుపు ధర్నాలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలను అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచడంపై మండిపడ్డారు. తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యాలు నశించాలంటూ నినదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు.
భయపడే ప్రసక్తే లేదు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రా జ్యాంగం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ భయపడే ప్రసక్తే లేదు. తిరుపతిలో ఎన్నడూ దాడులు జరిగి న దాఖలాలే లేవు. నైతిక విలువలు లేని బీఆర్ నా యు డిని టీటీడీ చైర్మన్‌గా కొనసాగించడం కంటే మహా పా పం మరొకటి ఉండదు. ఆయన్ని ఉపేక్షించడంలో ఆంతర్యమేంటో చెప్పాలి. – భూమన అభినయ్‌రెడ్డి,
తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త
బీఆర్ నాయుడుని తొలగించాలి
తిరుమల శ్రీవారి పరమభక్తుడిని, ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏడు కొండలనే చూస్తానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికై నా స్పందించాలి. బీఆర్ నాయుడు అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. చంద్రబాబు పాలనలో దాడులు, దౌర్జన్యాలే తప్ప ప్రజాపాలన లేదు. అక్రమ కేసులు పెడితే భయపడి ఇంట్లో ఉంటామనుకుంటే పొరబాటే. – చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి,
విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
న్యాయమే గెలిచింది.. అధర్మం ఓటమి పాలైంది.. ఇందుకు నిదర్శనం అక్రమ కేసులో అరెస్టయిన అందరినీ విడుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పడమే.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి రాసలీలలను వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. వీరిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. అధికార పార్టీ సూచనల మేరకు పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్సార్‌సీపీ నాయకులు పసుపులేటి సురేష్ బాబు అలియాస్ సురేష్, ఏ అజయ్కుమార్, ఈ.అనిల్కుమార్ రెడ్డి, బి అరుణ్ కుమార్ యాదవ్ అలియాస్ అరుణ్ యాదవ్, బృంగి నవీన్, ఎల్ .దినేష్, ఎన్. బాబు, ఏ. కోటి ,బి గీతా యాదవ్ అలియాస్ గీతాదేవి, ఎం. సాయికుమారి, కె లక్ష్మి ,జి విజయలక్ష్మి, కె.వి పద్మజ తదితరులను అరెస్టు చేశారు. దీనిపై న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు అందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
చిత్తూరు కార్పొరేషన్ : టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టడంపై మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు చిత్తూరులోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. విజయానందరెడ్డి మాట్లాడుతూ మహిళలను టీడీపీ నేతలు అసభ్యంగా దూషించడం హేయమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పాలనను ఇప్పటి వరకు చూడలేదని విమర్శించారు. బీఆర్‌నాయుడు రాసలీలలు బయటపడినప్పటికీ ఆయనను పదవి నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం ఫోన్‌లోనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినందుకు అప్పటి ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీని వెంటనే తొలగించారని గుర్తుచేశారు. బీఆర్ నాయుడు వీడియోలు వెలుగు చూసినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నిరసనకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ సంఖ్యలో మొహరించారు. కార్యక్రమంలో నేతలు గాయత్రీదేవి, విజయసింహారెడ్డి, కేపీ శ్రీధర్, సరళమేరీ, అంజలిరెడ్డి, హరిషారెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, సుగుణశేఖర్, అప్పొజీ, రజనీకాంత్, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, మనోజ్‌రెడ్డి, వెంకటేష్, ప్రతిమారెడ్డి, అల్తాఫ్, నారాయణ, దేవరాజులు, మనోహర్, డేవిడ్ పాల్గొన్నారు.
చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహనికి వినతిపత్రం ఇస్తున్న విజయానందరెడ్డి
ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు
‘‘ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు ప్రభుత్వం పాతరేసింది.. పేదల సంక్షేమానికి తిలోదకాలిచ్చింది.. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసింది.. కుటిల రాజకీయాలకు తెరతీసింది.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడమే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోంది. ప్రశ్నించిన వారిని జైలుపాలు చేస్తోంది.. నిలదీస్తే నిలువునా దాడులు చేయిస్తోంది.. నైతికత లేని వారిని అందలం ఎక్కిస్తోంది.. అన్యాయాలే అజెండాగా అక్రమార్కులకు కొమ్ముకాస్తోంది‘‘ అని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలను దారుణంగా కొట్టిన టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాలకు అండగా నిలిచి బాధితులపై ఆక్రమ కేసులు నమోదు చేసిన పోలీసుల వైఖరిని ఖండించారు. సర్కారు తీరును ఎండగడుతూ మంగళవారం చిత్తూరు..తిరుపతిలోని అంబేడ్కర్ విగ్రహాల వద్ధ మహాధర్నా చేపట్టారు.
చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తిన ఆగ్రహం


