తిరుపతి అర్బన్: పదో తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 165 పరీక్ష కేంద్రాల్లో 655 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు సోమవారం తమ సమీప ప్రాంతాల్లోని ఆలయాల్లో దేవుడికి మొక్కుకుని, తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. 4 శాతం మంది విద్యార్థులు మినహా మిగిలిన వారంతా పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోగా, 20 శాతం మంది విద్యార్థులు సోమవారం కావడంతో రాహుకాలం ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో రెండు గంటలకు పైగా సెంటర్ వద్ద వేచి ఉన్నారు. అక్కడే చదువుకుంటూ ఉండిపోయారు. ప్రతి విద్యార్థితోపాటు తల్లిదండ్రులు లేదా బంధువు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి విచ్చేశారు. తమ బిడ్డలకు ధైర్యం చెప్పి, పరీక్ష బాగా రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిబంధనలు కచ్చితంగా పాటించారు. జెరాక్స్ సెంటర్లు సైతం కేంద్రాల సమీప ప్రాంతాల్లో మూయించారు.
ఆకస్మిక తనిఖీలు
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతిలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రు మున్సిపల్ హైస్కూల్, శశి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ తిరుపతితోపాటు రేణిగుంటలో పలు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా స్థాయి పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ తొలిరోజు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే తొలిరోజు జిల్లాలోని 8 సమస్యాత్మక కేంద్రాల్లో మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో పరీక్షలు సజావుగా సాగాయి.
పలువురు విద్యార్థులు గైర్హాజరు
జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ విద్యార్థులు 27,243 మందికి 26,691 మంది హాజరయ్యారు. 552 మంది విద్యార్థులు తెలుగు పరీక్షకు గైర్హాజరయ్యారు. అలాగే ఓపెన్ స్కూల్‌కు సంబంధించి 885 మంది విద్యార్థులకు 785 మంది హాజరయ్యారు. వంద మంది గైర్హాజరయ్యారు.


