నాయుడుపేట టౌన్ : పట్టణ పరిధిలోని ఎన్‌ఎస్‌ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాళెం గ్రామానికి చెందిన వేపగుంట సాయి(25) తడ సమీపంలోని అపాచీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను ఆదివారం బైక్‌లో నాయుడుపేటలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం తిరిగి స్వగ్రామం బయలుదేరాడు. పట్టణంలోని ఎన్‌ఎస్‌ఆర్ కాలనీ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొని డివైడర్‌ను కూడా ఢీకొని కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతికి వచ్చే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్ (నంబర్లు 17480–17479) సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో నడుస్తాయి. తిరుపతి – బిలాస్‌పూర్ (నంబర్లు 17482–17481) గురు, ఆదివారాల్లో మాత్రమే నడుస్తాయి. ఈ నాలుగు నూతన రైళ్లు 18 బోగీలతో సోమవారం తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున పూరి నుంచి మరొకటి బయలుదేరుతాయి. 19న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున బిలాస్‌పూర్ నుంచి మరొకటి బయల్దేరుతాయి. అదే విధంగా తిరుపతి – అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నంబర్లు 12765–12766) మొత్తం 15 బోగీలతో ఈ నెల 21న తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మంగళ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుపతి – కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (నంబర్లు 17249–17250) మొత్తం 22 బోగీలతో ఈ నెల 22న తిరుపతి నుంచి ఒకటి, అదే రోజున కాకినాడ నుంచి మరొకటి బయలుదేరుతాయి. దీంతో పాటు తిరుపతి – రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ (నంబర్లు 16780 –16779) మొత్తం 17 బోగీలతో ఈనెల 26న రామేశ్వరంలో బయలుదేరి 27న తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల నూతన కార్యవర్గం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుపతి జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో నిర్వహించిన ఎన్నికలకు రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సుఖాని అధికారులుగా వ్యవహరించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా గోపీకృష్ణ, కార్యదర్శిగా పీవీ ప్రవీణ్, కోశాధికారిగా మహేష్, అసోసియేట్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా టి.భరత్, కె,భరత్, భాగ్యలక్ష్మి, భారతి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా లోకేష్, సంయుక్త కార్యదర్శులుగా మధు, కవిత, సత్యవేణి, సభ్యలుగా కళ్యాణి, వినీల్ ఎన్నికయ్యారు.
అన్నమయ్య విగ్రహానికి
విశేష అభిషేకాలు
తిరుమల: తిరుమల లేపాక్షి కూడలిలో గల శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహం వద్ద అన్నమయ్య 523వ వర్ధంతిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అభిషేక కార్యక్రమంలో అన్నమయ్య వంశ పరంపరలో 12వ తరానికి చెందిన తాళ్లపాక పవన్ భరద్వాజ్, తాళ్లపాక హైగ్రీవ నారాయణచార్యులు, కంచి రాజేష్ ప్రేమ్కుమార్, బెంగళూరుకు చెందిన విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభిషేకం జరిగినంతసేపు సిద్ధిపేటకు చెందిన పవన్ బృందం, వైజాగ్‌కు చెందిన భక్త బృందం, సింగపూర్‌కు చెందిన భక్తుల బృందం కలిసి సంకీర్తన సేవ నిర్వహించారు.
ముక్కంటి భక్తులకు ఉచిత బస్సు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తు ల కోసం అధికారులు ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. ఒక బస్సు ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 వరకు కైలాస సదనం, గంగా సదనం నుంచి ఆలయ నాలుగో గేటు, రైల్వేస్టేషన్, వరదరాజస్వామి అతిథి గృహం, ఆర్టీసీ బస్టాండు, భక్త కన్నప్ప సదన్, 1వ గేటు, 4వ గేటు నుంచి మళ్లీ కై లాస సదన్, గంగా సదన్‌కు నడుస్తుంది. మరో బస్సు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు కై లాస్ సదన్, గంగా సదన్ నుంచి 4వ గేటు, 1వ గేటు, ఆర్టీసీ బస్టాండు లోపలకు, వీఎంసీ సర్కిల్, భక్తకన్నప్ప సదన్, 1వ గేటు, 4వ గేటు కై లాససదన్, గంగా సదన్‌కు నడపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


