సైదాపురం : మండల కేంద్రమైన సైదాపురంలో ఆదివారం బైక్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సముద్రాలవారి కండ్రిగ గ్రామానికి చెందిన అద్వానపు వెంకటేశ్వర్లు(37) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం బైక్‌లో సైదాపురం వెళ్లి తిరిగి బయలుదేరాడు. సైదాపురం–తిప్పిరెడ్డిపల్లి రోడ్డులో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును స్థానికులు 108 వాహనంలో గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్ట నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం శవపరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
గుట్టకు నిప్పు అంటించిన ఆకతాయిలు
చంద్రగిరి: చంద్రగిరి పట్టణం సమీపంలోని బీడీ కాలనీ వద్దనున్న గుట్టకు ఆదివారం గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. వేడి ఎక్కువగా వస్తుండడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. చంద్రగిరి రాయలవారి కోట, దుర్గం కొండకు ఆనుకుని ఉన్న గుట్టలో మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలులు ఎక్కువగా వీస్తుండడంతో మంటలు దుర్గం కొండకు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
నంది కొండలకు కార్చిచ్చు
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని నంది కొండల్లోని అడవులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అడవంతా మంటలు వ్యాపించాయి. రెండు రోజులుగా అడవి కాలుతూనే ఉంది. అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోతోంది.


