తిరుపతి క్రైం : గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న హోటళ్లపై తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సివిల్ సప్లయీస్ అధికారులతో కలిసి దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్‌గుప్తా ఆదేశాల మేరకు, తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాల్లో మొత్తం 15 హోటళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న 4 హోటల్ యజమానులను గుర్తించారు. వారిపై 6(ఏ) ఈసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, మొత్తం 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


