చంద్రగిరి: పట్టణంలోని బీడీ కాలనీలో పోలీసుల బూట్ల శబ్ధంతో ప్రజలు గందరగోళంలో పడ్డారు. అసలు ఏమి జరుగుతోందో అర్థం కాక అయోమయానికి లోనయ్యారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలను చేస్తుతున్నట్లు పోలీసులు తెలపడంతో ప్రజలు ఊపరిపీల్చుకున్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 52 సిబ్బందితో కలసి కార్డన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో పాటు వారి వివరాలను సేకరించారు. కాలనీలో రికార్డులు సక్రమంగా లేని 24 వాహనాలను సీజ్ చేసినట్లు చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ తెలిపారు. పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వకుండా, శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ఈ కార్డన్ సెర్చ్‌ను చేపట్టినట్లు చెప్పారు. కొత్త వ్యక్తుల కదలికలు, గంజాయి, బెల్టు దుకాణాలు, అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరించేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.
రైలు ఢీకొని
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పాకాల: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని దామలచెరువు సమీపంలో చోటు చేసుకుంది. శనివారం స్థానిక రైల్వే పోలీసుల కథనం మేరకు.. దామలచెరువు సమీపంలో పట్టాలపై ఓ గురుతెలియని వ్యక్తి రైలు కింద పడి, మృతి చెందాడు. మృతుడు సుమారు 60 ఏళ్ల వ్యక్తి తెల్లచొక్కా, బ్లూ కలర్ లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్ట్‌ం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9133109537, 9440729533 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
జ్యువెలరీ షాపులో
పట్టపగలే దోపిడీ
సూళ్లూరుపేట: పట్టణంలోని కచేరివీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర జ్యువెలరీ షాపులో శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి నగలు కొనుగోలు చేయడానికి వచ్చినట్టు నటించి, షాపు యజమాని కళ్లల్లో కారంకొట్టి రూ.30 లక్షలు విలువ చేసే 916 కేడీఎం బంగార నగలను దోపిడీ చేసిన సంఘటన సంచలనంగా మారింది. మధ్యాహ్నం పూట బజారులో, షాపులో జనాలు తక్కువగా ఉన్న సమయాన్ని ఎంచుకున్న ఓ వ్యక్తి నగలు కొనుగోలు చేయడానికి వచ్చి, అన్ని నగలు చూశారు. మరికొన్ని మోడల్స్ చూపించమని అడిగి దుకాణం యజమాని తిరిగే సమయంలో జేబులో నుంచి డబ్బులు తీస్తున్నట్టుగా నటించి కారంపొడి ఆయన కళ్లలో కొట్టారు. చేతిలో ఉన్న నగలు తీసుకుని హడావుడిగా వెళ్లిపోయారు. షాపు యజమాని తేరుకుని బయటకు వచ్చేలోపే అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల పుటేజీలు చూసి అగంతకుడు కారం చల్లి నగలు దోచుకెళ్లిన విషయం నిర్థారించుకున్నారు. సీసీ కెమెరాల్లో స్పష్టంగా దోపిడీ జరిగినట్టుగా ఉన్నందున అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


