సహకార సంఘ చైర్మన్‌, సీఈఓ మధ్య వివాదం | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘ చైర్మన్‌, సీఈఓ మధ్య వివాదం

Mar 15 2026 4:55 AM | Updated on Mar 15 2026 4:55 AM

సూళ్లూరుపేట: స్థానిక రైతు సేవా సహకారం సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఏజీ కిషోర్‌, అదే సొసైటీలో సీఈఓగా పనిచేస్తున్న సుల్తాన్‌బాషా మధ్య శనివారం వివాదం చోటు చేసుకుంది. సబ్‌ డివిజనల్‌ కోఆపరేటివ్‌ అధికారి రవికుమార్‌ సమక్షంలో వీరిద్దరు ఒకరినొకరు దూషించుకున్నారు. ఇందులో చైర్మన్‌ అనుచరులు కొంతమంది సీఈఓపై దాడి చేసే ప్రయత్నం చేశారని బాధితుడు సుల్తాన్‌బాషా తెలిపారు. అయితే గతంలో ఇక్కడ పనిచేసి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌కుమార్‌పై కేసు పెట్టాలనే విషయంలో వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అధికారి రవికుమార్‌ సమక్షంలో చైర్మన్‌ కిషోర్‌ బూతులు తిట్టినా ఆ అధికారి వీరిని మందలించకుండా మిన్నకుండి పోవడం పలు విమర్శలకు దారి తీసింది. వెంటనే అతనికి నోటీస్‌ కూడా ఇచ్చారు. దీంతో సీఈఓ సుల్దాన్‌బాషా బయటకొచ్చి ఓ వీడియో విడుదల చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ఈ సొసైటీలో రూ.కోట్లు అవినీతికి పాల్పడిన విజయ్‌కుమార్‌పై 2025 డిసెంబర్‌లో, మళ్లీ ఈ ఏడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇదే కిషోర్‌ కేసులు నమోదు కానీకుండా చేశారన్నారు. ఆ సమయంలో పైరవీలు చేసి, కేసులు నమోదు కాకుండా కొంతమంది నాయకులు కాపాడారన్నారు. తీరా ఇప్పుడు హైకోర్టు నుంచి విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేయమని ఆర్డర్‌ వచ్చిందని, అధికారి సమక్షంలో చెబితే తనను దుర్భాషలాడడంతోపాటు అనుచరులతో దాడి చేయించే ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఇది చాలదన్నట్టుగా నోటీస్‌ జారీ చేశారని తెలిపారు. చైర్మన్‌గా ఆయన బాధ్యతలు ఆయన నిర్వహించలేదని, సొసైటీలో కేవలం యూరియా మాత్రమే ఇవ్వడంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయన్నారు. అందుకే సౌసైటీ కార్యాలయానికి వెనుకవైపు ఉన్న గోడౌన్‌ నెలకు రూ.30 వేలు అద్దెకు ఇచ్చామన్నారు. కార్యాలయంపైన ఎల్‌ఐసీ కార్యాలయానికి ఒక భవనం, ఆర్డీఓ కార్యాలయానికి మరోభవనం అద్దెకు ఇచ్చామని, వాటి అద్దె డైరెక్ట్‌గా అక్కౌంట్‌లో వేస్తారన్నారు. ఇలా ఆదాయం లేకుండా జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రూ.14 వేల జీతానికి మరో వ్యక్తిని నియమించుకున్నారని చెప్పారు. అతనికి 2025 సెప్టెంబర్‌ నుంచి జీతం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఇదే కాకుండా ఈ కిషోర్‌ చైర్మన్‌ కాకముందే సొసైటీలో డిఫాల్టర్‌గా ఉన్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక డబ్బులు కట్టకుండానే అందుకు సంబంధించిన పాసుపుస్తకాలు ఇమ్మని అడిగితే ఇవ్వలేదని తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వివాదం చేసి కావాలనే నోటీస్‌ ఇచ్చారని తెలిపారు. దీనిపై టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దీనిపై సొసైటీ చైర్మన్‌ కిషోర్‌ను వివరణ కోరగా అతనిపై తనకేమీ కక్షలేదని, గతంలో రూ.2 లక్షలు చెల్లించినా పాసుపుస్తకాలు ఇవ్వలేదన్నారు. తాను చైర్మన్‌ అయిన తరువాత మూడు నెలలుగా సొసైటీకి సంబంధించిన లెక్కలు ఇవ్వమని అడిగితే కాలయాపన చేస్తున్నారని చెప్పారు. అందుకని అధికారి సమక్షంలోనే మందలించి నోటీస్‌ జారీ చేశానని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement