తిరుపతి మంగళం : నగర రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ సీపీ పాలనలో తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అప్పటి డిప్యూటి మేయర్ భూమన అభినయ్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్‌హాలులో శుక్రవారం కార్పొరేషన్ చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కార్పొరేషన్ మొదటి మహిళా మేయర్‌గా డాక్టర్ శిరీష చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఐదేళ్లపాటు ఎంతో సౌమ్యంగా కార్పొరేటర్లు, అధికారులను సమన్వయం చేసుకుని నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. అలాగే తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా కౌన్సిల్లో ఆమోదించి చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయారన్నారు. తిరుపతి రాజకీయ నాయకులెవరికీ సాధ్యం కాని విధంగా తిరుపతి నగరంలో 21 మాస్టర్‌ప్లాన్ రోడ్లు, స్లిప్‌వే రోడ్లు, ప్రధాన కూడళ్ల సుందరీకరణ, వినాయకసాగర్ అభివృద్ధి, శ్రీనివాససేతు ప్లైఓవర్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తిరుపతి రూపురేఖలే మార్చేసిన నాయకులు భూమన కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్టి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


