శ్రీకాళహస్తి: ‘అది డాక్టర్ల ఫ్యామిలీ అనొచ్చునేమో. ఎందుకంటే ఆ ఉమ్మడి కుటుంబంలోని పిల్లలందరూ డాక్టర్లే. ఐదుగురు పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. వారి చదువులు చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. పదుగురికి సేవ చేసి కుటుంబ ప్రతిష్ట కాపాడుతారని కలలుగనేవారు. కానీ ఇందులో ఓ యువకుడిపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదరూపంలో కబళించింది. ఆ కుటుంబ ఆశలు వమ్ము చేసింది. కుటుంబ సభ్యులను తీరని దుఃఖసాగరంలో ముంచేసింది. వివరాలు.. శ్రీకాళహస్తి మండలం, రామాపురం గ్రామానికి చెందిన చిర్రి మస్తాన్‌ది ఉమ్మడి కుటుంబం. వారు వ్యవసాయంతోపాటు.. వివిధ వ్యాపారాలతో మంచి గుర్తింపు పొందారు. పిల్లల చదువుల కోసం శ్రీకాళహస్తికి వచ్చి స్థిరపడ్డారు. ఆ కుటుంబానికి చెందిన చిర్రి లిఖిత్‌సాయి (19) చిన్నప్పటి నుంచి చదువులో దిట్ట. గత ఏడాది లిఖిత్‌సాయి విజయవాడలోని ఓ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేరాడు. గురు వారం విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత్ సాయి తీవ్రంగా గాయపడి మృతి చెందా డు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం మృతదేహం శ్రీకాళహస్తిలోని వారి నివాసానికి చేరింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. నియోజకవర్గ వ్యాప్తంగా కుటుంబానికి ఉన్న పరిచయాల కారణంగా బంధువులు, స్నేహితులు, రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని కన్నీటి నివాళి అర్పించారు.
పిల్లలందరూ డాక్టర్లే
మస్తాన్‌కు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ముగ్గురికీ ఆరుగురు పిల్లలు ఉండగా.. అందులో ఐదుగురు పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మస్తాన్ అక్క కొడుకు, కూతురు సైతం ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ ఘటనతో వారి కుటుంబానికి దిష్టి తగిలిందేమో అని స్థానికులు కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది.


