పంటకాలువ పేరుతో కక్ష సాధింపు జగనన్న కాలనీలోని ప్లాట్లపై పంట కాలువ తవ్వకాలు ముందస్తు సమాచారం శూన్యం జగనన్న ఇంటి పట్టాలను చేతపట్టి లబ్ధిదారులు నిరసన బాధితులకు భరోసా ఇవ్వని అధికారులు
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీ, అడుసుపాళెం జగనన్న లేఅవుట్‌పై స్థానిక అధికార పార్టీ నాయకులు కక్ష కట్టారో ఏమో తెలియదు గానీ, గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ప్లాట్లలో పంట కాలువ తవ్వుతూ క్షణికానందం పొందుతున్నారు.
కాలువ తవ్వకంతో దాదాపు 43 ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ సిబ్బంది మ్యాప్‌లో కాలువ ఉందని చెబుతుండడం తో ఏమి చేయాలో తెలియక లబ్ధిదారులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ పనులతో కాలనీలోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారులు అడుసుపాళెం సమీపంలో సర్వే చేసి 3500 ప్లాట్లు వేసి, పేదలకు పంపిణీ చేశారు. అలాంటి లేఅవుట్‌పై స్థానిక అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మ్యాప్‌లో కాలువ ఉందని చెబుతూ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఇలాంటి చర్యలు తీసుకోవడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
అధికారుల ప్రేక్షక పాత్ర
జగనన్న లేఅవుట్‌లోని ప్లాట్‌లో కాలువ తవ్వడం కనీసం తహసీల్దార్‌కు ముందుగా తెలియక పోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు అంటున్నారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ గోడును చెప్పుకున్న, నామ మంత్రంగా లేఅవుట్ వద్దకు వచ్చి, పరిశీలించి వెళ్లిపోయారు. మా ప్లాట్లలో కాలువ తవ్వకుండా ఆపండని బాధితులు ప్రాథేయపడినా అధికారులు ఏమి చేయకుండా వెన్ను తిరగడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలు పాటించరా?
ఒకవేళ గతంలో కాలువలోనే అప్పటి రెవెన్యూ అధికారులు పేద ప్రజలకు జగనన్న పట్టాలు ఇచ్చి ఉంటే, ముందుగా సర్వే చేసి ఎంతమంది కాలువతో ప్లాట్లు కోల్పోతారో తెలుసుకుని, వారికి నోటీసులు ఇవ్వడం గానీ, ప్రత్యామ్నాయంగా మరో చోట ప్లాట్లు ఇచ్చే ప్రయత్నాలు చేయడం కానీ చేసి ఉండాలి. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అసలు ప్లాట్లు కలిగిన యజమానులకు కనీస సమాచారం ఇవ్వకుండా స్థానిక అధికార పార్టీ నాయకులు దగ్గర ఉండి కాలువ తవ్వడంపై స్థానికంగా చర్చనీయంగా మారింది.
అధికార పార్టీ నాయకుడు డబ్బులు డిమాండ్
కాలువ పేరుతో జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకున్న వారిని స్థానిక టీడీపీ నాయకుడు వారి అనుచరుల ద్వారా డబ్బులు డిమాండ్ చేసి, డబ్బులిచ్చిన వారి ఇళ్లు వదిలేసి, తాము ఇవ్వలేమని చెప్పిన వారి ప్లాట్లలో కాలువ తవ్వకాలు జరిపినట్లు స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఆ నాయకుడికి భయపడే అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
దయగల దేవుడు జగనన్న మాకు ఇళ్లు ఇచ్చాడు.. నేడు కాలువ పేరుతో మా గూడు చెరిపేస్తున్నారు.. మాపై కూటమి నేతలు కాలకూట విషం చిమ్ముతున్నారు. నాడు కొలతలు తీసిన అధికారులు నేడు నోరు మెదపడం లేదు.. మాకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు.. పంట కాలువలో మీ ప్లాట్లు ఉన్నాయని కాలువ తవ్వేస్తున్నారు.. మా సొంతింటి కల చెరిపేస్తున్నారు. ఇదేమి న్యాయం మహాప్రభో అని జగనన్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా వారి గూడు..గోడు వినే నాథుడే కరువయ్యారు.


