తిరుపతి తుడా: పట్టణంలోని ఔషధ నియంత్రణ శాఖలో అవినీతి బహిరంగ రహస్యంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ షాపుల లైసెన్సుల మంజూరు, రెన్యువల్ పేరుతో అధికారుల మామూళ్ల దందా నడుస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. కొత్తగా మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలన్నా, ఇప్పటికే ఉన్న దుకాణానికి లైసెన్సు రెన్యువల్ చేయించుకోవాలన్నా అధికారుల చుట్టూ తిరగాల్సిందేనని చెబుతున్నారు. నిబంధనల పేరుతో అడుగడుగునా అభ్యంతరాలు చెప్పడం, ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం, చివరికి లావాదేవీలు జరిగితేనే అనుమతులు ఇవ్వడం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెన్యువల్‌కు మామూలే మార్గం?
మెడికల్ షాప్ నిర్వహించాలంటే ఔషధ నియంత్రణ శాఖ నుంచి లైసెన్సు తప్పనిసరి. లైసెన్సుకు నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. అయితే రెన్యువల్ ప్రక్రియ వ్యాపారులకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. దరఖాస్తు చేసిన తర్వాత ఫైళ్లు నెలల తరబడి కదలవని చెబుతున్నారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా వెళ్లి లావాదేవీలు జరిపితే మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
బ్రోకర్లుగా అసోసియేషన్ నేతలు
ప్రైవేట్ మెడికల్ షాపుల అసోసియేషనన్‌కు చెందిన కొందరు నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులతో లావాదేవీలు జరిపించి కొత్త లైసెన్సులు, రెన్యువల్ ఫైళ్లను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. మెడికల్ షాప్‌ల నుంచి నెలవారీగా మామూళ్లు వసూలు చేసి, వాటిని అధికారులకు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఏడీ చాంబర్ చేరడం అంత ఈజీ కాదు
ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌ను కలవడం కూడా సులభం కాదని వ్యాపారులు చెబుతున్నారు. కార్యాలయ ప్రధాన గేటు ఎక్కువసేపు మూసే ఉంటుందని, లోపలికి వెళ్లిన తర్వాత అటెండర్ అనేక ప్రశ్నలు అడిగి వేధిస్తారని అంటున్నారు. చెప్పులు బయట వదిలేయాలని, మొబైల్ ఫోన్లు కూడా బయట పెట్టి వెళ్లాలని చెప్పి, తర్వాతే అధికారిని కలవనిస్తారని సమాచారం. కార్యాలయం మొత్తం గోప్యతతో, కట్టుదిట్టమైన భద్రతతో ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల షి‘కారు’
అధికారులు పర్యటనలు, పరిశీలనకు కూడా తామే కారు ఏర్పాటు చేయాల్సి వస్తోందని మదనపడుతున్నారు. కారుతో పాటు డీజిల్ పట్టి పంపించాల్సిన దు స్థితి ఏర్పడిందని ఆగ్రహానికి గురవుతున్నారు. లేకుంటే చిన్న చిన్న తప్పిదాలను చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇందుకు కొందరు అసోసియేషన్ సభ్యు లు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మామూళ్లు ఇస్తేనే అనుమతి
నిబంధనల ప్రకారం మెడికల్ షాప్ ఏర్పాటుకు కనీసం 120 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. అయితే కొద్దిగా విస్తీర్ణం తక్కువగా ఉన్నా అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో అడిగినంత మామూలు ఇస్తే ఆ లోటును ఎలా సరిచేయాలో అధికారులే మార్గం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనలు కేవలం వ్యాపారులను భయపెట్టేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకుంటారా?
ఔషధ నియంత్రణ శాఖలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ జరపాలని వ్యాపారులు కోరుతున్నారు. లైసెన్సులు, రెన్యువల్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని, మధ్యవర్తుల దందాను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


