తిరుపతి కల్చరల్: తిరుమల పరకామణిలో పెంచలయ్య రూ.కోటి ఆభరణాల చోరీ విషయంపై తాము ప్రశ్నిస్తే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పొంతన లేని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడమేకాక అనవసర ఆరోపణలు చేయడం విడ్డూరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే.అజయ్‌కుమార్, నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్ తెలిపారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. పరకామణి చోరీ విషయంలో తాము ఆయన్ని ప్రశ్నిస్తే సమాధానాలు విస్మరించి, ఏదో అభాండాలు భూమన కరుణాకరరెడ్డిపై మోపడం ఈ కూటమి నేతలకు పరిపాటిగా మారిపోయిందన్నారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసులు వేసిన భానుప్రకాష్‌రెడ్డి తర్వాత ఆ కేసు ఎందుకు వాపసు తీసుకున్నారో? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు అరుణ్ యాదవ్, తాళ్లపాక మహేష్ యాదవ్ పాల్గొన్నారు.
జీతమో రామ ‘చంద్రా’...!
తిరుపతి సిటీ: ఎస్వీయూలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు అందక నరకయాతన అనుభవిస్తున్నారు. 13వ తేదీ వస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత బోధన, బోధనేతర సిబ్బంది వర్సిటీ అధికారులను వేతనాలపై ఆరా తీయగా అడిషనల్ గ్రాంట్ కోసం ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, వచ్చిన వెంటనే జీతాలు చెల్లిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. పెన్షనర్ల అవస్థలు వర్ణనాతీతం. పెన్షన్ సక్రమంగా అందక, రిటైర్డ్ బెనిఫిట్స్ సైతం ఒక రూపాయి వర్సిటీ చెల్లించకపోవడంతో మందులు, మాత్రలు, కుటుంబం పోషణకు అప్పులు చేస్తున్నామని వాపోతున్నారు. ఈనెల వేతనాలు చెల్లిస్తారా? లేదా అనే అనుమానంతో వర్సిటీలో ఉద్యోగులు ఆవేదన వక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఎన్నికల సమయంలో ప్రభుత్వాల ఉద్యోగులకు నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని మభ్యపెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఒక నెల కూడా ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెక్ బౌన్స్ కేసులో మహిళకు జైలు
తిరుపతి లీగల్: చెక్ బౌన్స్ కేసులో తిరుపతి, శివజ్యోతినగర్‌కు చెందిన ఎం.పద్మావతికి ఆరు నెలలు జైలు శిక్ష , రూ.10 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ గురువారం తీర్పు చెప్పారు. తిరుపతి, జీవకోన, రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన పి.ముని రాజా వద్ద పద్మావతి 2021 ఫిబ్రవరి 26వ తేదీ రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ సొమ్ము చెల్లించే క్రమంలో ఆమె 2022 మార్చి మూడో తేదీ రూ.9 లక్షల విలువ చేసే చెక్కును ముని రాజాకు ఇచ్చారు. అతను ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో అతను పద్మావతిపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఆమెకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.


