తిరుపతి అన్నమయ్యసర్కిల్: పంచగవ్య ఉత్పత్తుల సామర్థ్యం మరింతగా పెంచి, భక్తులకు సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈఓ (వైద్యం, విద్య) డాక్టర్ ఎ. శరత్ స్పష్టం చేశారు. అలిపిరి సమీపంలోని నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో దేశీయ ఆవుల మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో సుమారు 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తున్నామని చెప్పారు. సహజమైన విధానంలో, భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా మరింత నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీతో పాటు, ఇండెంట్ ప్రకారం సరఫరా చేయడం, ఉత్పత్తి విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. టీటీడీ సమాచార కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల అమ్మకాలను మరింత పద్ధతిగా నిర్వహించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, పాల్గొన్నారు.


