శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో తుది దశ నిర్మాణంలో ఉన్న సోలుం ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పురోగతి సమీక్షలో భాగంగా సోలుం కంపెనీ లిమిటెట్ చైర్యన్, సీఈఓ సంఘోజున్ మంగళవారం తొలిసారిగా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్ వద్ద శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సుంఘోజున్‌కు సాదర స్వాగతం పలికి శ్రీసిటీ ప్రగతి, ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా ఎలా అభివృద్ధి చెందిందన్న విషయం గురించి వివరించారు. శ్రీసిటీ, సోలుం సంస్థ భాగస్వామ్యం భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి ఊతం ఇస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీసిటీ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, సమర్థ నిర్వహణను సుంఘోజున్ ప్రశంసించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం, శ్రీసిటీ అందిస్తున్న సౌకర్యాలను ఆయన అభినందించారు. శ్రీసిటీలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 268 కోట్లు పెట్టుబడితో సోలుం ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో తన రెండో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి దోహ దం కానుంది. ఈ ప్లాంట్‌లో త్రీఇన్ వన్ టీవీ బోర్డు లు, సర్వర్ పవర్ సప్‌లైలు, ఈవీ చార్జర్ భాగాలు, కంట్రోల్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ షెల్స్ లేబుల్స్, (ఈఎస్‌ఎల్‌ఎస్) వంటి ఆధునిక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేయనున్నారు. దీంతో పవర్ మాడ్యూల్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ తయారీలో సోలుం సంస్థ గ్లోబల్ మార్కెట్‌లో మరింత బలపడనుంది.


