తిరుపతి అన్నమయ్యసర్కిల్:గిరిజన బాలికకు భరోసా కల్పిస్తూ ఆమె భవిష్యత్తుకు అండగా నిలుస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మానవతా దృక్పథంతో సహాయం అందించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడు గ్రామానికి చెందిన పూజ(10) గిరిజన బాలిక ఈ నెల 3వ తేదీన అదృశ్యమైన ఘటనను జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ రవి మనోహర్‌ఆచారి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ కనుగొని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న జిల్లా యంత్రాంగం మానవీయతతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గిరిజన బాలిక, ఆమె సోదరుడి కోసం రూ.లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్, పోలీస్ శాఖ తరఫున రూ.10 వేల నగదు సహాయం, నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.


