కాలువలో తడిసేలా.. చూస్తే జడిసేలా!
ఈ చిన్నారులు ఇక్కడేదో సరదాగా కాలువలో ఆడుకోవడం లేదు. వారు పాఠశాలకు వెళ్లడానికి కాలువ దాటే సాహసం చేస్తున్నారు. చదువుకొనలేని పేద విద్యార్థులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వాహన వసతి లేమికి తోడు దారి లేక ఇక్కట్లు పడాల్సి వస్తోంది. బాబు ప్రభుత్వ హయాంలో చదువుకోవాలంటే కాలువలు, పంట పొలాల గట్లు, అడవులు దాటాల్సి వస్తోంది. బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని గోవిందప్పనాయుడుకండ్రిగ గ్రామంలోని అదర్శ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో పిచ్చిగుంట కాలనీకి చెందిన 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పిచ్చిగుంట కాలనీ నుంచి పాఠశాలకు రోడ్డు మార్గం రావాలంటే 11 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ క్రమంలో పాఠశాలకు ఆటోలో వెళుతుండేవారు. ఆటోకు రూ.600 పైనే అద్దె చెల్లించారు. ప్రభుత్వం ఆటోకు వ్యయం చేసిన నగదును చెల్లించలేదు. దీంతో ఆటోను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నెల రోజులుగా పెద్దపాలేడు చెరువుకు నీరందించే వరవ కాలువ దాటి, పంట పొలాల గట్లపై స్కూలుకు వెళుతున్నారు. వర్షం కురిసిన రోజు పాఠశాలకు వెళ్లడం లేదు. ప్రభుత్వం రవాణా చార్జీలే ఇస్తే విద్యార్థులకు ఈ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. – బుచ్చినాయుడుకండ్రిగ
కాలువలో తడిసేలా.. చూస్తే జడిసేలా!


