తిరుపతి తుడా : గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రయోజనాలే ప్రామాణికం కావాలని మేయర్ శిరీషకు రాయలసీమ మేధావుల ఫోరమ్ విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌ను ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ఫోరం సమన్వయకర్త పురుషోత్తమరెడ్డి కలసి పలు అంశాలను వివరించారు. రాయలసీమ ప్రాంతంలో హైదరాబాద్, విశాఖ తరహా మహానగరానికి అవకాశం తిరుపతికి ఉందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు గ్రేటర్ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం మంచి పరిణామమన్నారు. ప్రణాళికాబద్ధంగా నగరాల రూపకల్పన , విస్తరణ జరగకపోతే భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. నీటి వనరుల సరఫరా, భూమి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన, విస్తరణ, అభివృద్ధిలో ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ తిరుపతి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రస్తుత నగర సరిహద్దుల నుంచి 4 వైపులా విస్తరణ చేపట్టాలన్నారు. చంద్రగిరి కల్యాణి డ్యామ్, రాయలచెరువు, అంజేరమ్మ కణం, ఐఐటి వరకు మహానగర సరిహద్దులు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిలో టీటీడీ, శ్రీవారి భక్తుల రాకపోకలు ప్రధానంగా ఉంటాయని, దీనికి అనుగుణంగా నగర విస్తరణ జరగాలని సూచించారు. అందులో భాగంగా బస్టాండ్ సముదాయం, రైల్వేస్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, టీటీడీ సత్రాలను నగరానికి నాలుగు వైపులా నిర్మించాలని కోరారు.


