తిరుపతి అర్బన్ : జిల్లాలోని చెరువుల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం కనీస మాత్రం చర్యలు చేపట్టలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ చెరువుల బలోపేతానికి చేసింది శూన్యమని విమర్శిస్తున్నారు. కేవీబీపురం మండలం కళత్తూరులో రాయల చెరువుకు గండిపడి ఊరు మొత్తం కొట్టుకుపోయే దుస్థితి దాపురించేందుకు సర్కారు నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది చెరువులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇరిగేషన్ అధికారులు కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


