
రేపు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతు తుడా: దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం స్విమ్స్ ఆస్పత్రి ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అత్యవసర సేవలు కొనసాగుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,675 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,681 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన వారికి సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
అట్టహాసంగా ‘దీక్షారంభం’
చంద్రగిరి : శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో శనివారం సాయంత్రం నిర్వహించిన దీక్షారంభం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీక్షారంభం కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు నూతన విద్యార్థులను డైరీ టెక్నాలజీపై క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. దీంతో పాటు బీటెక్ (డైరీ టెక్నాలజీ) 43వ బ్యాచ్ ఫ్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ జేవీ రమణ, ప్రత్యేక అతిథిగా డైరీ సైన్స్ డీన్ డాక్టర్ నాగేశ్వరరావు, అధ్యక్షుడు డాక్టర్ వైకుంఠరావు, అసోసియేట్ డీన్ డాక్టర్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ జేవీ రమణ మాట్లాడుతూ.. దీక్షారంభం కార్యక్రమం ద్వారా వ్యక్తిత్వ వికాసం, విద్యా అవకాశాలపై అవగాహన పొందారని పేర్కొన్నారు. 15 రోజుల కార్యక్రమానికి సంబంధించిన నివేదికను విద్యార్థులు వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ వెటర్నరీ ఆడిటోరియంలో ఫ్రెషర్‌డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వెటర్నరీ సైన్స్ డీన్ డాక్టర్ ఆర్‌వి. సురేష్ కుమార్, డాక్టర్ శోభారాణి, కళాశాల అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రేపు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు