
ఏర్పేడు ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
● పనులు పరిశీలించిన ఎంపీ గురుమూర్తి
ఏర్పేడు : ఏర్పేడు–వెంకటగిరి జాతీయ రహదారి బైపాస్ మార్గం ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి సూచించారు. శనివారం ఆయన ఏర్పేడు సమీంలోని రోడ్డు పనులను పరిశీలించారు. ఏర్పేడు ఎల్.సి 36 రైల్వే క్రాసింగ్ కారణంగా ఏర్పేడు–వెంకటగిరి మార్గం వాహనాల రాకపోకలకు రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. 2023లో రూ. 98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలైనా కాంట్రాక్టర్లు ఇంకా పూర్తి చేయకుండా నత్తనడకన సాగిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ ఐఐటీ, ఐసర్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, అలాగే వెంకటగిరి, రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఏర్పేడు సమీపంలో రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతోనే తాను ఆగిపోయిన వంతెన పనులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడిన ఎంపీ బ్రిడ్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
పత్రికలపై కక్ష సాధింపు
చిల్లకూరు : ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం సమంజసం కాదని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి భయపెట్టడం తగదన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక వార్త ప్రచురించారని కక్ష కట్టి సాక్షి ఎడిటర్‌పై కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ శిరీషాను కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏర్పేడు ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి