
కల్వర్టు కింద ఖరీదైన మాత్రలు
తిరుపతి రూరల్: ప్రభుత్వాస్పత్రుల్లో ఉండాల్సిన మాత్రలు కల్వర్టు కింద కనిపించాయి. ఖరీదైన ఈ మాత్రలను సర్కారు సైతం అంతంత మాత్రంగానే సరఫరా చేస్తుంది. అయితే ఫిజీషియన్ శాంపుల్స్ కింద సంబంధిత మందుల కంపెనీ వారు ఉచితంగా వైద్యులకు పంపుతుంటారు. వీటిని అవసరమైన రోగులకు వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది. వాటిని వెసుకున్న వారు కాసేపటికే మత్తులోకి వెళ్లక తప్పదు. ఒకటి, రెండు మాత్రలు తీసుకుంటే చాలు శరీరంలోని అలెర్జీ మొత్తం ఇట్టే తగ్గిపోతుంది. ‘మత్తు’ను కలిగించే ఆ మాత్రలు గుట్టలు, గుట్టలుగా ఓ కల్వర్టు కింద బయట పడడంతో స్థానికులు నివ్వెరపోయారు.
పరిశీలనకు వెళితే..
తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు నుంచి పాతకాల్వ కుంటలోనికి నీరు చేరే కాలువ (కల్వర్టు కింద)లో ఖరీదైన మందుల డబ్బాలు బయటపడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కల్వర్టు వద్ద మట్టి తవ్వకాలు లోతుగా చేయడం, చెరువు స్థలాన్ని కప్పేయడంతో స్థానికంగా నివాసముంటున్న ఎంపీపీ మూలం చంద్ర మోహన్‌రెడ్డి ఆ మట్టి పనులను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఆయన వెంట వెళ్లిన మీడియా ప్రతినిధులకు అక్కడి కల్వర్టు కింద అలెర్జీకి ఉపయోగించే మాన్‌టెక్–ఎల్‌సీ అనే మాత్రల డబ్బాలు కనిపించాయి. మొదట ఎక్స్‌పైర్ అయిన మందులు అక్కడ పడేశారని తేలిగ్గా తీసుకున్నారు. ఒక సారి చూద్దామని పరిశీలిస్తే తయారీ తేదీ 09/2024, ఎక్స్‌పైర్ తేదీ 02/2027గా నమోదై ఉంది. అవి ఒక్కో స్ట్రిప్ రూ.330లుగా బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అంత ఖరీదైన మాత్రలను కల్వర్టు కింద ఎందుకు పడేశారని ఆరా తీయగా, ఎవరైనా మత్తుకు బానిసలుగా మారి వారు అక్కడ దాచిపెట్టారనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తవయ్యాయి. అయితే ఆ మాత్రల డబ్బాలపై ఫిజీషియన్ శాంపిల్స్.. నాట్ ఫర్ సేల్ అని రాసి ఉండడం గమనార్హం. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కల్వర్టులు కింద కొందరు యువకులు చేరుతున్నారని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కల్వర్టు కింద ఖరీదైన మాత్రలు