
బస్సులు.. తప్పవు పడిగాపులు
తిరుపతి బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు(ఫైల్)
తిరుపతి అర్బన్ : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ సభలు నిర్వహించినా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత 5 నెలల వ్యవధిలో 6 సమావేశాలకు మొత్తం 1,170 బస్సులను తిరుపతి నుంచి తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ఈక్రమంలోనే గురువారం కర్నూలులో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సైతం జన సమీకరణ నిమిత్తం బుధవారమే జిల్లా నుంచి 325 బస్సులను తీసుకెళుతున్నారు. తిరిగి శుక్రవారం ఆ సర్వీసులు జిల్లాకు రానున్నాయి. దీంతో మూడు రోజుల పాటు ప్రయాణికులకు బస్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు తప్పని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా అన్ని డిపోల్లో మొత్తం 774 బస్సులు ఉన్నాయి. అందులో 70 బస్సులు మరమ్మతుల్లోనే ఉంటున్నాయి. మిగిలిన 700 బస్సుల్లో 325 సర్వీసులను తరలిస్తే కేవలం 375 బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. 50శాతం బస్సులను ఒక్క సభ కోసం పంపిస్తే ప్రజలు ఎంత ఇబ్బందిపడతారో కూడా ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు మండిపడుతున్నారు.
జిల్లా నుంచి తరలిన బస్సుల వివరాలు
మే 2న : అమరావతి సభకు – 156
మే 18న : యోగా దినోత్సవానికి వైజాగ్‌కు – 35
మే 29న : టీడీపీ మహానాడుకు – 154
సెప్టెంబర్ 10న : అనంతపురంలో సూపర్ సిక్స్
సభకు – 335
సెప్టెంబర్ 19న: విజయవాడలో డీఎస్సీ
ఉపాధ్యాయుల సభకు – 165
అక్టోబర్ 15న : కర్నూలు సభకు 325