
ఇవేం గొడవలు బాబోయ్!
రేణిగుంట: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి, అటెండర్ తిరుమలేష్ మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం సదరు అటెండర్‌తో డాక్యుమెంట్ రైటర్లు, అటెండర్ ఘర్షణ పడ్డారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం జిల్లా డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ నేతలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ తిరుమలేష్‌తో వాగ్వాదానికి దిగారు.
తిరగబడిన క్రయవిక్రయ దారులు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు తిరగబడ్డారు. డాక్యుమెంట్ రైటర్లు, అటెండర్ మధ్య రోజూ గొడవలు జరుగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. పనులు మానుకొని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇలా ఘర్షణ పడటం తగదని మండిపడ్డారు. ఏదైనా ఉంటే బయట చూసుకోండని తెగేసి చెప్పారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ జోక్యం చేసుకుని డాక్యుమెంట్ రైటర్లను వెలుపలకు వెళ్లాలని ఆదేశించారు.
రైటర్ల నిరసన
జిల్లా డాక్యుమెంట్ రైటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిరసన తెలిపారు. అటెండర్ తిరుమలేష్‌పై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందించారు.

ఇవేం గొడవలు బాబోయ్!