
పరిహారం ఎగ్గొట్టి.. పొలం గట్లు తెగ్గొట్టి!
●
వరదయ్యపాళెం : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఏపీఐఐసీ అధికారులు వేధిస్తున్నారు. భూసేకరణ కింద తీసుకున్న భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. పొలాలు సాగుకు పనికిరాకుండా గట్లు తెగ్గొట్టేశారు. వివరాలు.. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు రైవెన్యూలోని సర్వే నెంబర్ 83/2లో 1.48 ఎకరాలు డి.శకుంతలమ్మ పేరిట, 83/3లో 1.73 ఎకరాలు డి. రత్నం పేరిట 45ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం డీకేటీ పట్టాలను అందజేసింది. అప్పటి నుంచి ఆ భూముల్లో వారు వ్యవసాయం చేసుకుంటున్నారు. 2016లో చిన్న పాండూరు సమీపంలో ఏపీఐఐసీ సెజ్ రావడంతో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఎకరాకు రూ. 6.5లక్షలు పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అయితే వారికి బీ కేటగిరీలో ఎకరాకు రూ. 3.25లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన పరిహారం కోసం గత 9ఏళ్లుగా ఈ ఇద్దరు రైతులు అటు కలెక్టర్, ఆర్‌డీఓతోపాటు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ పరిహారం మాత్రం అందలేదు. అయితే గత ఏడాది వరకు భూమిని వారే సాగు చేసుకుంటూ ఉండేవారు.
బెదిరించి.. తొలగించి
అయితే రెండు రోజుల క్రితం రైతులు డి. రత్నయ్య, శకుంతలమ్మకు చెందిన భూముల్లోకి ఏపీఐఐసీ సిబ్బంది ప్రవేశించారు. హిటాచీతో పొలంగట్లను పూర్తిగా తొలగించి భూముల రూపురేఖలను మార్చేశారు. సాగు చేసుకునేందుకు వీలు లేకుండా పొలం ఆనవాళ్లను చెరిపేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారు.
న్యాయం చేయండి
సుమారు 45 ఏళ్ల నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. గత ఏడాది కూడా సాగు చేశాం. అయితే బుధవారం సాయంత్రం ఏపీఐఐసీ అధికారులు మా పొలం గట్లు తొలగించేశారు. వరినాట్లకు సిద్ధం చేసుకున్న భూమిని నాశనం చేసేశారు. పైగా మాపైనే కేసులు పెడతామని బెదిరించారు. అప్పట్లో ఆ భూమిని రూ.లక్షలు వెచ్చించి సాగుకు సన్నద్ధం చేసుకున్నాం. భూమినే నమ్ముకున్న మమ్మల్ని ఇలా ఇబ్బందిపెట్టడం దారుణం. పూర్తిస్థాయి పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
– రత్నయ్య, బాధిత రైతు, చిన్న పాండూరు

పరిహారం ఎగ్గొట్టి.. పొలం గట్లు తెగ్గొట్టి!