
రైలు నుంచి జారిపడి విద్యార్థి మృతి
నాయుడుపేటటౌన్ : నాయుడుపేట రైల్వేస్టేషన్ సమీపంలో మెము రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సంతోష్ (17) అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు. వరదయ్యపాళెంకు చెందిన సంతోష్ నెల్లూరు జిల్లాలోని వఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి రోజు మాదిరిగా కళాశాలకు వెళ్లేందుకు స్నేహితులతో కలిసి తడలో మెము రైలు ఎక్కి బయలు దేరగా నాయుడుపేటకు రాగానే ఫుట్‌పాత్ సమీపంలో నిల్చున్న సంతోష్ కాలుజారి రైలు కింద పడిపోయాడు. గమనించిన స్నేహితులు చైన్ లాగి రైలు నిలుపుదల చేశారు. రైలు కిందపడి తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తి అరెస్టు
తిరుపతి క్రైమ్ : ప్రభుత్వ పనితీరు, నాయకులపై అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెస్ట్ సీఐ మురళీమోహన్ పేర్కొన్నారు. కదిరికి చెందిన అంజద్ ఖాన్(43) కొంత కాలంగా నకిలీ ప్రొఫైల్ సృష్టించి పార్టీల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా, ప్రముఖ నాయకుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు చేస్తున్నారని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేశారు.