
వానెల్లూరు అక్రమాల గుట్టురట్టు
సత్యవేడు : సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామంలో 300 ఎకరాల అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ వెబ్ ల్యాండ్‌లో అక్రమ నమోదుకు సంబంధించి 16 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీ నాయుడు తెలిపారు. శనివారం సత్యవేడు తహసీల్దారు రాజశేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. వానెల్లూరులో సర్వే నంబరు 197లో 287.64 ఎకరాలు తంబి అలియాస్ రాజ ిపిళ్లై పేరుపై ఉన్నట్లు రెవెన్యూ ఎస్‌ఎల్‌ఆర్ రికార్డుల్లో ఉందన్నారు. అనంతరం ఆ భూమి నాలుగు సబ్ డివిజన్లుగా విభజించి ఇందులో 197/1లో 252.16 ఎకరాలు 1972లో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అటవీ భూములుగా ప్రకటించారు. అయితే ఇదే సర్వే నంబరు భూములను 197/1 ఏ నుంచి ఎఫ్ వరకు చైన్నెకి చెందిన ఆరుగురి పేర్లుపై 2024 జూన్ 12వ తేదీన రెవెన్యూ వెబ్ ల్యాండ్‌లో నమోదు చేశారన్నారు. ఈ భూముల నమోదులో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సాదాబైనామా ద్వారా అప్పటికే మల్లీశ్వరీ పేరుతో ఉన్న సర్వే నంబరు 186–2ఏ2 , హనుమంతు బాతమ్మ పేరుతో సర్వే నంబరు 138/2కు సంబంధించి వెబ్ ల్యాండ్ తెరిచి నమోదు చేశారు. అయితే ఈ ప్రక్రియలో అప్పటి తహసీల్దారు రామాంజనేయులు వేలి ముద్ర వేస్తేనే వెబ్‌ల్యాండ్‌లో నమోదు అవుతుందన్నారు. ఎన్నికల విధులకు వచ్చిన రామాంజనేయులు 2024 ఫిబ్రవరి 7 నుంచి జూలై 27 వరకు సత్యవేడులో తహసీల్దారుగా పనిచేశారు. అప్పటి కన్నావరం సచివాలయం వీఆర్‌ఓ భార్గవ్ ఆయన సతీమణి తేజస్వీ, అప్పటి సచివాలయ సిబ్బంది పూర్ణచందునాయుడు, ఆధార్ కార్డులతో పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవడంతో పాటు లేని భూములను తప్పుడు రికార్డులతో విక్రయించడానికి చైన్నెకి చెందిన ఆరుగురు స్కెచ్ వేశారన్నారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు అందడంతో ప్రస్తుత తహసీల్దారు రాజశేఖర్ దీనిపై దృష్టి సారించి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారన్నారు. అటవీ భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వారిలో తమిళనాడుకు చెందిన శ్రీధరన్, అమృతవర్షిని, నవీనరాజ్‌కన్న, అనూరాధ, జైరేమార్, లతజయ్‌కుమార్, ఆశాసురేష్ ఉన్నట్లు తెలిపారు. ఆశా సురేష్ పేరుతో సర్వే నంబరు 200/1లో 49.88 ఎకరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి ఆధార్ కార్డులు, రికార్డులు ఏవీ లేకుండా వెబ్‌ల్యాండ్‌ల్లో అటవీ భూములను నయోదు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారానికి సంబందించి ఆరుగురు అధికారులపైన మిగిలిన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అటవీ భూములకు సంబంధించి రెవెన్యూ, అటవీ అధికారులు ఉమ్మడి సర్వే చేయిస్తామన్నారు. సర్వే నంబరు 197/1లో అటవీ భూములు యథాస్థితిలో ఉండగా ఇదే సరే నంబర్ ఆరు సబ్ డివిజన్లుగా ఇతరుల భూ ఖాతాల్లోకి వెళ్లి నమోదు చేశారన్నారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి అసలైన సూత్రదారులు ఎవరో నిగ్గు తేల్చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రామస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.