
యూత్ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘ప్రేమిస్తున్నా’
తిరుపతి కల్చరల్ : ఐబీఎం ప్రొడెక్షన్ ద్వారా చక్కటి ప్రేమ కథతో పాటు మదర్ సెంటిమెంట్ మిళతంతో యూత్ ఎంటర్‌టైన్మెంట్‌తో రూపొందించిన ‘ప్రేమిస్తున్నా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని ఈ చిత్రం దర్శకుడు భాను తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్రం యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూనిట్ సభ్యులు శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల పొందిన అనంతరం ఈ చిత్రం ట్రైలర్‌తో పాటు రెండు పాటలను యూటూబ్ ద్వారా విడుదల చేశామని, దీనికి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను రూపొందించిన ఫ్యామిలీ చిత్రాలు రూపొందించి విజయం సాధించడం జరిగిందని, ప్రస్తుతం ఈ చిత్రాన్ని పూర్తి లవ్ స్టోరీతో చిత్రీకరించామన్నారు. ఈ చిత్రంలో 19 సినిమాల్లో చైల్డ్ అర్టిస్టుగా నటించి మెప్పించిన సాత్విక్ వర్మ తొలి సారి హీరోగా నటించారని తెలిపారు. ఈ సినిమాలో తిరుపతికి చెందిన ప్రీతి నేహా హీరోయిన్‌గా నటించిందన్నారు. అంతేకాక ఈ సినిమాకు టాప్ టెక్నీషన్స్ పనిచేయడంతో పాటు సిద్దార్థ సాల్వా సంగీత దర్శకుడిగా పరిచయం చేయడం జరిగిందన్నారు. చిత్రం హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. తన ప్రతిభను గుర్తించి తొలిసారిగా ఈ చిత్రంలో హీరో అవకాశాన్ని దర్శకుడు భాను కల్పించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా నటించి మెప్పించానని తెలిపారు. నవంబర్ 7వ తేదీన విడుదలవుతున్న ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఐబీఎం ప్రొడెక్షన్ అధినేత కనక దుర్గారావు, రవికుమార్ పాల్గొన్నారు.