
యల్లంపల్లిలో గజరాజులు
చంద్రగిరి:అటవీ సమీప ప్రాంతాల్లోని పంట పొలా లపై గజరాజుల దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో గజ దాడులతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నా రు. గ్రామస్తుల వివరాల మేరకు.. మండల పరిధిలోని యల్లంపల్లిలోని పంట పొలాలపై శుక్రవారం రాత్రి సుమారు 11 ఏనుగుల గుంపు చేరుకున్నాయి. రాత్రి 7 గంటలకు ఏనుగులను గుర్తించిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు గంటల పాటు అటవీ అధికారులు రాకపోవడంతో పంట పొలాలను తొక్కి నాశనం చేసినట్లుగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందించిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఉంటే నష్ట తీవ్రత తగ్గేదని, అయితే అటవీ అధికారులు నిర్లక్ష్యంగా కారణంగా తమ పంటలు ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికి రాకపోవడంతో తీవ్ర అప్పులపాలవుతున్నామంటూ వాపోతున్నారు. చివరకు అర్ధరాత్రి తర్వాత గ్రామస్తులు, అటవీ అధికారులు సంయుక్తంగా బాణాసంచా పేల్చూతూ, కేకలు వేయడంతో ఏనుగులు అడవుల్లోకి వెళ్లిపోయాయి. అయితే శనివా రం రాత్రి కూడా ఏనుగులు వచ్చే అవకాశం ఉండటంతో యల్లంపల్లితో పాటు పరిసర అటవీ సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.