
తప్పిపోయిన బాలుడి అప్పగింత
చంద్రగిరి : శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్తున్న కుటుంబం నుంచి బాలుడు తప్పిపోయిన ఘటన శనివారం చోటు చేసుకుంది. విజిలెన్స్ అధికారుల వివరాల మేరకు... రాజంపేటకు చెందిన వెంకటేష్ కువైట్‌లో పనిచేస్తున్నాడు. శ్రీవారి దర్శనార్థం వెంకటేష్ భార్యతో పాటు తమ్ముడు రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. ఈ క్రమంలో శ్రీవారిమెట్టు వద్ద వెంకటేష్ కుమారుడు పార్థీవ్ తప్పిపోయి ఏడుస్తూ ఉండడాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న జమేదారు చిరంజీవి గుర్తించాడు. అనంతరం బాలుడిని విచారించగా వివరాలను తెలిపాడు. ఈ మేరకు వెంకటేష్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అనంతరం వెంకటేష్, తన తమ్ముడు రమేష్‌కు సమాచారాన్ని చేరవేశాడు. అనంతరం రమేష్‌తో పాటు బాలుడు తల్లి శ్రీవారిమెట్టు వద్దకు చేరుకుని తమ బాలుడిని గుర్తించారు. జమేదారు తప్పిపోయిన బాలుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో, భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.